
ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్ : ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్ ఉప్పునే వినియోగించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. జగన్నాథ రావు అన్నారు. ప్రపంచ అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధుల వారోత్సవాలను ఆయన శనివారం పార్వతీపురంలో ప్రారంభించారు. వారోత్స వాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డివిజనల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, వర్కు షాపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయోడిన్ లోపం వల్ల పిల్లల శారీరిక, మానసిక వృద్ధి, మనో వికాసం లోపిస్తుందన్నారు. గర్భస్థ శిశువుల పిండ అభివృద్ధి, నిర్మాణం మందగిస్తుందని, స్త్రీలలో గర్భ స్రావం, మృత శిశువు జననం, మరగుజ్జుతనం వంటి అవకాశాలు ఉంటాయని చెప్పారు. పిల్లల్లో బుద్ధి మాంద్యం, చెవుడు, మూగతనం రావచ్చన్నారు. గాయిటర్ వ్యాధి, హైపో థైరాయిడ్ వ్యాధులు సంభవించవచ్చని చెప్పారు. ఈ లోపాలను అధిగమించడానికి ప్రజలందరూ అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. అయోడిన్ ఉప్పు కలిగిన పేకెట్స్ పై నవ్వుతున్న సూర్యడి బొమ్మ గుర్తు ఉంటుందని, గ్రామ స్థాయిలో అరోగ్య కేంద్రం ద్వారా ఉప్పులో అయోడిన్ ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుపీహెచ్ సి వైద్యులు లావణ్య, ఏఎన్‌ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.