Aug 18,2023 22:55

సామినేనికి వినతిపత్రం ఇస్తున్న రైతులు

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుని శుక్రవారం రైతు సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో వరదలకు దెబ్బతిన్న రాజీవ్‌ మున్నేరు చెక్‌ డ్యామ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ ఆనకట్టకు గండ్లు పడటం వలన నీరంతా వథాగా కిందకు వెళుతుంది. మరమ్మత్తులు వెంటనే చేపడితే నీటిమట్టం పెరిగి సాగుకు నీళ్లు సరిపోతాయి. ఈ ఆనకట్ట మరమ్మత్తులకు సుమారుగా రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. తక్షణమే నిధులు విడుదల చేసి, ఆనకట్టను బాగు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా రైతు సంఘం పరిశీలనలో వెల్లడైన అంశాలు:
1) పోలంపల్లి చెక్‌డ్యామ్‌కు వరుసగా 3 గండ్లు పడ్డాయి. 20 అడుగులు ఉన్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వం పూడ్చాలి. 2) ప్రథమ దశలో బ్రిటిష్‌ వారు కట్టిన గోడ 4 అడుగుల సుమారు 15 మీటర్ల పొడవునా వరదలకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలి. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు మిర్చి, ప్రత్తి, వరినాట్లు వేసుకోవడానికి నారు పోసి ఉన్నారు. నాట్లు పడాలంటే మున్నేరు చెక్‌ డ్యామ్‌కు వెంటనే మరమ్మతులు చేసి, వథాగా వెళుతున్న నీటిని నిల్వచేసి, నీటి నిలువ సామర్థ్యం పెంచి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్‌, రైతుసంఘం జిల్లా నాయకులు సిహెచ్‌ హనుమంతరావు, మండల కార్యదర్శి టి.రాంబాబు, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి రమేష్‌, బి.రాము తదితరులు పాల్గొన్నారు.