Jul 26,2023 21:52

డిఆర్‌ఒకు వినతిని అందజేస్తున్న రైతులు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : పెద్దంకలాం ఆనకట్ట కాలువ పనులు పూర్తి చేసి, కాలువలో పేరుకుపోయిన సిల్టు తొలగించి చివరి భూములకు సాగునీరివ్వాలని ఎపి రైతు సంఘం జిల్లా రైతు సంఘం కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం డిఆర్‌ఒ జె.వెంకట్రావుకు వినతిని అందజేశారు. అనంతరం లక్ష్మునాయుడు, మండల కార్యదర్శి బలగ సత్యనారాయణ మాట్లాడుతూ పెదఅంక లాం కాలువ ద్వారా సాగునీరు రావడం లేదని, గండ్లు పూడ్చలేదని తెలిపారు. కాలువలో పేరుకుపోయిన సిల్ట్‌ తొలగించలేదని, కాలువ మరమ్మతుల పేరిట నాలుగేళ్ల నుంచి చుక నీరు ఇవ్వలేదని తెలిపారు. పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. లైనింగ్‌ పనులు ప్రారం భించినా ఎక్కడా జరగలేదన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ మైన కాలువలో నీరు రాకపోవడం వల్ల రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. జైకా నిధులు రూ.18 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారో తెలియడం లేదని అన్నారు. ఇలా పనులు చేస్తే మరో ఐదు, ఆరేళ్లయినా సాగునీరందని పరిస్థితి నెలకొందన్నారు. కావున తక్షణమే కాలువలో పేరుకుపోయిన సిల్ట్‌ తొలగించి గండ్లు పూడ్చి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని కోరారు. వినతిని అందజేసిన వారిలో రైతు కూలీ సంఘం నాయకులు మామిడి సింహాద్రి నాయుడు, శంకర్రావు, లక్షణ, సిపిఎం నాయకులు వై.మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.