ప్రజాశక్తి-నందిగామ: ఐడిసి నిధులు, నీటి పారుదల సంస్థ నిధులతో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నాలుగేళ్లుపూర్తవుతున్నా పూర్తికాక చివరి భూములకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌ఎస్‌పి కాలవల ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించటానికి కృష్ణానదిపై రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కొంతమేర పైపులైను విస్తరణ, ఇన్‌టెక్ వెల్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పూర్తయితే ఆయకట్టు చివరి భూములకు కృష్ణానది నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ, చందర్లపాడు మండలాల నాగార్జున సాగరకాలవలకు నీరు అందించటానికి కాట్రేనిపల్లి వద్ద నదిపై కేతవీరునిపాడు-గుత్తవారిపాలెం ఎత్తిపోతల పథకాలు నిర్మించటానికి ఐడిసి రూ.34.49 కోట్ల వ్యయంతో ప్రతిపాదించింది. ఈ పనులకు 2018లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కేతవీరునిపాడు, గుత్తవారిపాలెం ఎన్‌ఎస్‌పి మైనరు కాలవల ఆయకట్టులో 2120 మంది రైతులకు 5225 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కృష్ణానది ఒడ్డున పంప్‌హౌస్ నిర్మాణం పూర్తి చేశారు. అక్కడ నుండి ఈ కాలవ 10.5 కిలోమీటర్ల పొడవునా పైపులైను విస్తరించారు. చందాపురం వద్ద కేతవీరునిపాడు ఎత్తిపోతల పథకాలకు 350 మీటర్ల గ్రావిటీ పైపులైను విస్తరించాలి. కృష్ణానదిలో ఇన్‌టెక్ వెల్స్ నిర్మించాలి. ఈ పనుల్లో జాప్యం వల్ల ఆయకట్టుకు సాగునీరు సరాఫరా కాక నష్టపోతున్నామని చందాపురం, కేతవీరునిపాడు, అడివిరావులపాడు, ముప్పాళ్ల, గుత్తవారిపాలెం గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ట్రైల్ రన్ పరిశీలించారు. వీటి నిర్మాణం పూర్తయితే కాలవల ఆయకట్టులో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలకు నీరందుతుంది.
మే నాటికి పనులు పూర్తి
ఐడిసి నందిగామ డిఇఇ నాగమణి
కృష్ణానది ఒడ్డున హెడ్ వర్క్సు పూర్తయ్యాయి. అక్కడ నుండి కాలవలకు 10.5 కిలో మీటర్ల దూరం గ్రావీటి పైపులైను విస్తరించటం జరిగింది. 350 మీటర్ల గ్రావిటీ పైపులైను విస్తరించాల్సి ఉంది. ఇన్‌టెక్ వెల్ నిర్మించాల్సి ఉంది. నదిలో నీరు తగ్గుతుంది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మే నాటికి పనులు పూర్తవుతాయి.










