ప్రజాశక్తి - చింతలపూడి
దేశంలో ప్రజలకు రూ.2.50 కోట్ల టన్నుల ఆయిల్ అవసరమవుతుందని దీనిలో కోటీ 50 లక్షల టన్నుల ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. చింతలపూడి మండలం సీతానగరం గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో జరిగిన మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ సాగు పెరుగుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే మరింతమంది సాగు చేసేందుకు ముందుకువస్తారన్నారు. 40 లక్షల హెక్టార్లలో రైతులు పామాయిల్ సాగు చేయగలిగితే ఇతర దేశాల నుండి ఆయిల్‌ను దిగుమతి చేసుకునే అవసరం ఉండదని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పామాయిల్ పంట అంతరించిపోతుందని ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తయిన పామాయిల్ మొక్కలను తొలగించి ఇతర పంటలకు రైతుల ముగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలో పామాయిల్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కమిషనర్ పికె.సింగ్, డైరెక్టర్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.










