Dec 06,2022 22:37

కనీసం గుర్తింపు కార్డులూ ఇవ్వని వైనం - కనీస వేతనాలు, ఎక్స్‌గ్రేషియా లేక విలవిల - సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌
ప్రజాశక్తి - పశ్చిమ డెస్క్‌

           పని చేస్తేనే పూట గడిచే బతుకులు.. రైతు పండించే పంటలో 80 శాతానికిపైగా శ్రమ వీరిదే. మొక్క వేసిన దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకూ రైతులకు అండగా ఉంటారు. ఇంత చేసినా ఆ శ్రమ జీవులకు మాత్రం ఎటువంటి గుర్తింపూ లేదు. వారే పామాయిల్‌ కార్మికులు.. ఇది ఆయిల్‌పామ్‌ తోటల్లో పని చేసే శ్రమ జీవుల గోడు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులచే సేద్యం చేయిస్తోంది. వాటిలో పామాయిల్‌ సాగు ప్రధానమైంది. రాష్ట్రంలో మెట్టప్రాంతంలో, భూగర్భ జలాలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంట బాగా పండుతోంది. దీని దిగుబడి మాములు ప్రాంతాల్లో పండే దానికంటే ఈ ప్రాంతంలో రెట్టింపు ఉంటుంది. సుమారు 2.57 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతోంది. అతితక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఆదాయం వచ్చే నేపథ్యంలో రైతులు వరి సాగు స్థానంలో ఈ పామాయిల్‌ సాగు చేస్తున్నారు. దీనికి ఉద్యాన, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖ పలు రాయితీలిస్తున్నాయి. పంట సాగు కోసం ఉద్యాన అనుబంధ సంస్థలు, బోర్డులు, ఏజెన్సీలు, నోడల్‌ ఏజెన్సీలతో పలు పథకాలను రైతులకు అందిస్తోంది. ఆయిల్‌పామ్‌ చట్టం-1993 ప్రకారం జాతీయ ఆహార భద్రత మిషన్‌, ఆయిల్‌పామ్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం-ఎపి) ప్రకారం రాష్ట్రంలో అన్ని ఆయిల్‌పామ్‌ కంపెనీలు, ప్రభుత్వం ఐదు నుండి 40 సంవత్సరాలు ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు రాయితీలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంట తీసుకునేలా ఆయిల్‌పామ్‌ (నవభారత్‌, గోద్రెజ్‌) కంపెనీల నుంచి ముడి పామాయిల్‌ ఉత్పత్తిని తీసుకుంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ఫ్యాక్టరీలకు అనేక రాయితీలు కల్పిస్తోంది. మొక్క సరఫరాలో 85 శాతం సాగు చేయడానికి నాలుగు సంవత్సరాలకు 50 శాతం, తోటలో అంతర పంటలకు నాలుగు సంవత్సరాలకు 50 శాతం రాయితీలు ఇస్తుంది. బోరుబావులకు, సేద్యం కోసం మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిబంధనలు అమలు చేస్తోంది. ఈ విధంగా ఎకరాకు మూడు నుండి ఆరు టన్నుల పంట పండుతోంది. ఫ్యాక్టరీల్లో పంటకు మంచి మద్దతు ధర ఇస్తుంది. సుమారు టన్నుకు రూ.20 వేల నుండి రూ.23 వేల వరకు పలుకుతోంది. ఈ పంటలో రైతు పడే కష్టానికి రెట్టింపు ఆదాయం వస్తోంది. అయితే ఈ పంటలో పని చేసే కార్మికుల బతుకులు మాత్రం రోజురోజుకీ దయనీయంగా మారుతున్నాయి.
రాష్ట్రంలో పామాయిల్‌ పంటను నవభారత్‌, గోద్రెజ్‌, 3ఎఫ్‌ వంటి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయి. వీటి యాజమాన్యం రైతులకు మంచి ఆదా యాన్నిస్తుండగా ఆ పంట అందించే కార్మికులకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో రైతులే ప్రభుత్వ ఆధీనంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. దీనిలో సుమారు ఐదు నుండి 10 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. చిన్న, సన్నకారు రైతుల దగ్గర నుండి భూస్వామి వరకు ఈ ఫ్యాక్టరీలో యజమానులుగా ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి అన్నిరకాల రాయితీలు కల్పిస్తోంది. దీన్ని చూసుకుని ప్రయివేట్‌ ఫ్యాక్టరీలు నవభారత్‌, గోద్రెజ్‌, 3ఎఫ్‌ వంటి బహుళజాతి సంస్థలు రెచ్చిపోతున్నాయి. కార్మికులకు కష్టమొచ్చినా, ప్రమాదాలు జరిగినా తమకు ఎలాంటి సంబంధమూ లేదని చేతులెత్తేస్తున్నాయి.
గుర్తింపు ఇచ్చేది.. ఎప్పుడు..?
ఏళ్లు తరబడి పామాయిల్‌ తోటల్లో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి గుర్తింపూ లేదు. రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌కు, జిల్లా ఉద్యానశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వేలాది మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటీ.. ప్రయివేట్‌ ఫ్యాక్టరీల యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసురావడం లేదు అనే అంశాలు కార్మికుల్లో చర్చనీయాంశమయ్యాయి. అందుకే ప్రభుత్వం స్పందించి పామాయిల్‌ తోటల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పామాయిల్‌ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తోంది.
అందని కనీస వేతనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ఉపాధిహామీ కూలీలకు అనేక చట్టాలు తెచ్చాయి. అయితే నేటికీ అమలుకు నోచుకోకపోవడం సిగ్గుచేటు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కనీస వేతనం కార్మికులకు దక్కకుండా సంస్కరణలు తీసుకొస్తోంది. దీనిలో పామాయిల్‌ కార్మికులు బలిపశువులుగా మారారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించిన కార్మికచట్టాలను దేశవ్యాప్తంగా కార్మికుల పొట్టకొట్టే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చారు. దీనిలో భాగంగా కనీస వేతనాల చట్టప్రకారం నేడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎనిమిది గంటలు పని చేసే పామాయిల్‌ కార్మికునికి రూ.800 ఇవ్వాలి. ప్రస్తుతం రూ.600 ఇచ్చి రైతులు చేతులు దులుపుకుంటున్నారు. అత్యంత దారుణంగా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే పురుషులకు రూ.400, మహిళలకు రూ.250 ఇస్తున్నారు. కూలీ పెంచుకోవడానికి, రాబోయే కాలంలో పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి.