Sep 20,2023 21:05

సమావేశంలో మాట్లాడుతున్న రవిచంద్రబాబు

రాజంపేట అర్బన్‌ : ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌ ఫామ్‌ సాగు చేస్తే ప్రోత్సాహకాలు అందజేస్తామని జిల్లా ఉద్యాన అధికారి రవిచంద్ర బాబు అన్నారు. బుధవారం ఉద్యాన శాఖ, సువెన్‌ ఆగ్రో ఇండిస్టీస్‌ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం, రాజం పేటలో 'ఆయిల్‌ ఫామ్‌ సాగుపై' డివిజనల్‌ స్థాయిలో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌ ఫామ్‌ పంట సాగుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. జిల్లాలో రాజంపేట, నందలూరు, పెనగలూరు, కోడూరు, చిట్వేలు, ఓబుల వారిపల్లి, పుల్లంపేట మండలాలలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 100 హెక్టారుల లక్ష్యాన్ని కేటాయించారని తెలియజేశారు. రైతులు హెక్టార్‌ కు 143 మొక్కలు నాటుకోవాలన్నారు. ఉద్యాన శాఖ నుండి స్వదేశీ రకానికి హెక్టార్‌ కు రూ 20,000, దిగుమతి రకానికి రూ.28000 రాయితీని కల్పిస్తుందన్నారు. పంట సాగు ఖర్చులకు మొదటి నాలుగు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం హెక్టారుకు రూ.5,250 చొప్పున మొత్తం రూ.21 వేలు, అంతర్‌ పంటలు పండించినందుకు నాలుగేళ్లకు హెక్టారుకు రూ.21 వేలు రాయితీ కల్పిస్తుందని తెలిపారు. ఆయిల్‌ ఫామ్‌ నాటిన మొదటి 4 నుంచి 8 ఏళ్ల పాటు ఎకరాకు 6 నుంచి 7 టన్నులు దిగుబడి, 8 ఏళ్ల పైబడిన తోటల్లో ఎకరానికి 8 నుంచి 12 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయిల్‌ ఫామ్‌ సాగును ప్రోత్సహిస్తూ బిందు సేద్య పరికరాలు కూడా సన్న ,చిన్న కారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీని కల్పిస్తుందని తెలియచేశారు. ఆసక్తి గల రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఉద్యాన అధికారి జి.సురేష్‌ బాబు, సువెన్‌ ఆగ్రో ఇండిస్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజర్లు కొండారెడ్డి, మల్లిఖార్జున్‌ రెడ్డి, రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల వి.ఏ.ఏ.లు, విహెచ్‌ఎలు, ఎంపిఇఒలు పాల్గొన్నారు.