
ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణత పెంచేందుకు ఉద్యానవన శాఖ కృషి చేయాలని కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశించారు. ఉద్యానవన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలను ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. తుమ్మపాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అగ్రి, హార్టి ఎఫ్‌పిఓ, కె.కోటపాడు కృషిఫల ఎఫ్‌పిఓ, అడ్డూరు సుఫలా జాగృతి ఎఫ్‌పిఓను సందర్శించి ఉద్యానవన శాఖ ద్వారా అందుతున్న పథకాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్షన్ సెంటర్లను కోల్డ్ స్టోరేజీలను పరిశీలించారు. బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామంలో శాంతి ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించారు. ఉద్యానవన శాఖ చేపట్టిన పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయిన వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు, తుమ్మపాల ఎఫ్‌పిఓల సంఘం అధ్యక్షులు పడాల గణపతి రావు, కార్యదర్శి ఎరుబండి సత్యనారాయణ, ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఎఫ్‌పిఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
కూరగాయల సేకరణ కేంద్రాలు ఎంతో ఉపయోగకరం
కె.కోటపాడు : గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పళ్ళు, కూరగాయల సేకరణ కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి అన్నారు. సోమవారం మండలంలోని గొండుపాలెంలో నిర్మిస్తున్న కూరగాయల కలెక్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గ్రూపుగా ఏర్పడి వారు పండించిన ఉత్పత్తులను ఈ కలెక్షన్ సెంటర్ ద్వారా విక్రయించుకోవచ్చని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఈ కలెక్షన్ సెంటర్లు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. కె.కోటపాడు మండలంలో ఐదు సెంటర్లు మంజూరు కాగా, గొండుపాలెం, కింతాడ, కె.సంతపాలెం, పిండ్రంగి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. కూరగాయలు, పళ్ళు తదితర ఉత్పత్తులను మార్కెటుకు తరలించడానికి వాహనాలు, ఇతర సౌకర్యాలన్నీ రైతు ఉత్పత్తిదారుల సంస్థకే మంజూరు చేయబడతాయని చెప్పారు. ఒక్కో కలెక్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.15 లక్షల మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకరరావు, స్థానిక ఉద్యానవన శాఖ అధికారి కిరణ్మయి, వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు పాల్గొన్నారు.