31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన ఈ దేశం వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని గౌరవించకుండా...ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే మోడీ...అనే తరహాలో ఆలోచిస్తున్న బిజెపి, ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రాలకు కోవిడ్ సహాయంలోనూ విమర్శలనెదుర్కొంది. ఎ.పి, తెలంగాణలతో సహా రాష్ట్రాల సమస్యల పట్ల ఇచ్చిన వాగ్దానాల పట్ల ఉపేక్ష ప్రదర్శించింది. స్థానిక బిజెపి నేతలు కూడా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తామని, తామే నిధులు ఇస్తున్నామని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సిబిఐ, ఇ.డి, ఎన్‌ఐఎ వంటి వాటిని ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగిస్తున్నారు. ఇవి ప్రజలు ఆమోదించడం లేదు గనకనే రాష్ట్రాల ఎన్నికలలో బిజెపిని తిరస్కరిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలే తిరిగి గెలిచాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారినా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వచ్చారు. అన్నిటిలోకి చారిత్రాత్మకమైంది కేరళలో ఎల్‌డిఎఫ్ పునరాగమనం కాగా ఎక్కువ నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ రాష్ట్రం కైవశం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. కాంగ్రెస్, వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయిన ఫలితంగా బిజెపి పెద్ద ప్రతిపక్షంగా రావడమే ఘన విజయమని ఇప్పుడు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలు ఎనిమిది దశల్లో జరపడంతో సహా బిజెపి శ్రుతిమించిన ఎత్తుగడలు, హిందూత్వ కార్డును ప్రయోగించడం, మోడీ రవీంద్రనాథ్ టాగూర్ వేషాలు వేయడం, తృణమూల్ నుంచి విపరీతంగా ఫిరాయింపులు ప్రోత్సహించడం ఇలాంటివన్నీ బెంగాలీలలో నిరసన పెంచాయి. మమత పాలనపై ప్రజలకు అనేక ఫిర్యాదులున్నా పక్కన పెట్టి ఆమెకే పెద్ద ఎత్తున ఓటేశారు. ఈ ద్విముఖ పోరులో కాంగ్రెస్, వామపక్షాల ఓటింగు కూడా పీల్చివేయబడింది. నందిగ్రామ్‌లో ఆమె ఓడిపోవడం, ముఖ్యమంత్రి కావడానికి ఆటంకం కాలేదు గాని అందులోని రాజకీయ సంకేతం విస్మరించరానిది. బిజెపి కి, మోడీ-షా ద్వయం దూకుడుకు, దురహంకారానికి బెంగాల్ తిరస్కరణగానే ఈ ఫలితాలను పరిగణించాల్సి వుంటుంది.
కేరళ, తమిళనాడు ప్రత్యేకతలు
ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ ఒకటి తర్వాత ఒకటి వంతుల వారీగా గెలుస్తూ వచ్చిన కేరళలో నలభై ఏళ్ల వరవడిని తిరగరాసి పినరయి విజయన్ నాయకత్వంలో ఎల్‌డిఎఫ్ మళ్లీ విజయం సాధించడం, తమిళనాడులో స్టాలిన్ నాయకత్వం లోని డిఎంకె విజయభేరి మోగించడం కూడా మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకు ఎదురుదెబ్బలు. రాష్ట్రాల హక్కుల కోసం జరిగే పోరాటానికి ఊతమిచ్చే విజయాలు. కేరళ దేశానికి మొదటి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇచ్చిన రాష్ట్రం కాగా తమిళనాడు తొలి ప్రాంతీయ పార్టీగా డిఎంకె కు పట్టం కట్టిన రాష్ట్రం. అన్నాడిఎంకె పునాదితో తను పాగా వేయాలని బిజెపి జయలలిత అనారోగ్యం నాటి నుంచి చాలా పాచికలు వేసింది. రజనీకాంత్‌ను తేవాలని ప్రయత్నించి విఫలమైంది. స్టాలిన్ ఘన విజయం సాధించగా అన్నాడిఎంకె కూడా గౌరవప్రదంగా బయిటపడటం, దాని సాయంతో బిజెపి నాలుగు స్థానాలకు పరిమితం కావడం అంచనాలకు తగినట్టే వుంది. విజయన్, స్టాలిన్ ఇద్దరూ మోడీ విధానాలపై తీవ్ర విమర్శకులే. కేరళలో విజయన్ ప్రభుత్వం రెండు సార్లు వరదలనూ నిఫా, కోవిడ్ వైరస్‌లను తట్టుకుని ప్రజలను ఆదుకోవడంలో జయప్రదమైన తీరు ప్రపంచ ప్రశంసలు పొందింది. అలాంటి చోట శబరిమలై సమస్యను ఇంకా బంగారం స్మగ్లింగ్ వంటి లేనిపోని ఆరోపణలను తెచ్చి కేంద్రం అధికారాల సహాయంతో ప్రయోజనం పొందాలని బిజెపి చేయని ప్రయత్నం లేదు. మరో వంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సర్వశక్తులూ సమయమూ సిపిఎం ను ఓడించడానికే వెచ్చించి అస్సాంను కూడా ఉపేక్షించారు. ఈ రెండు దాడులను తట్టుకుని ప్రకృతి వైపరీత్యాలను, కోవిడ్‌ను కూడా అధిగమించిన ఎల్‌డిఎఫ్ కు కేరళ విజయం చేకూర్చింది. బెంగాల్ ఫలితాలలో చాలా నిరుత్సాహం కలిగించిన తరుణంలో కేరళలో అసాధారణ విజయం వామపక్షాల ప్రాధాన్యతను చాటింది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఊపిరిపోసింది. కేరళ, తమిళనాడు ఫలితాలతో దక్షిణాదిన బిజెపి విజయం సాధించడం దుస్సాధ్యమని తేలింది. ఇదే సమయంలో ఎ.పి, తెలంగాణ ఉప ఎన్నికలలో బిజెపి డిపాజిట్లు కోల్పోయింది కూడా. ఒక్క పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త, పాత ఫిరాయింపుదార్ల కూటమిలో భాగం సంపాదించింది.
మతపరమైన విభజన
అస్సాంలో బిజెపి, ఎన్‌డిఎ అధికారం నిలబెట్టుకున్నా కాంగ్రెస్ నాయకత్వం లోని కూటమి గట్టిపోటీనే ఇచ్చింది. బెంగాల్‌లో బెడిసికొట్టిన హిందూ జాతీయవాద వ్యూహం సిఎఎ, విదేశీ చొరబాట్ల ప్రచారంతో కూడిన మత పరమైన ఉద్వేగాల వ్యూహం అస్సాంలో అక్కరకు వచ్చింది. అయితే అక్కడ కూడా ఎజిపి తో కలసి మాత్రమే విజయం సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అస్సాంలో బిజెపి ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేకపోవడం, దాని వ్యూహాత్మక తప్పిదాలు, ఎఐఎంఎల్ నాయకుడైన పరిమళ వ్యాపారి అజ్మాల్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలన్న మత ప్రచారం కూడా పనిచేశాయి. బెంగాల్‌లో, అస్సాంలో మత ప్రాతిపదికన జరిగిన ప్రచారం పర్యవసానాలు దేశానికి మరీ ముఖ్యంగా తూర్పు ఈశాన్య భారతానికి ఆందోళనకర సంకేతాలే. మమత విజయంతో పాటే బెంగాల్‌లో పెరిగిన హింసాత్మక ఘటనలు ఇందుకొక హెచ్చరికగా వున్నాయి. వీటిని దేశ విభజన నాటి మత మారణహోమంతో పోల్చిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాటల్లో ఈ హెచ్చరిక దాగి వుంది. నిజంగానే దేశ విభజన సమయంలో అతి భయానకమైన హత్యాకాండ చూసిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. కాని వామపక్షాల ముప్పై ఏళ్ల పాలనలో ఆ ఊసే అందరూ మర్చిపోయేంత మత సామరస్యం విలసిల్లింది. ఇప్పుడు బిజెపి పెద్ద ప్రతిపక్షంగా రాగానే వాటిని గుర్తుచేయడం యాదృచ్ఛికం కాదు. బిజెపి కి హిందూత్వకు వ్యతిరేకంగా తను ముస్లిం కార్డు ప్రయోగించిన మమత విధానాలు కూడా ఈ పరిస్థితిని తీవ్రం చేస్తాయి. బెంగాల్‌లో ఘోరంగా దెబ్బతిన్న వామపక్షాలు కూడా సమీక్ష చేసుకుని సరైన పాఠాలు తీసుకోవలసి వుంది.
రాష్ట్రాలలో పారని మోడీత్వ !
మొత్తంపైన బిజెపి కేంద్రంలో పాలిస్తున్నా రాష్ట్రాలకు వచ్చేసరికి అంత స్థాయిలో ప్రభావం చూపలేకపోత్నునదని ఈ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. పార్లమెంటులో 303 స్థానాలు లేదా యాభై అయిదు శాతం పొందిన బిజెపి రాష్ట్రాలలోని 4 వేల పైచిలుకు అసెంబ్లీ స్థానాలలోనూ కేవలం 1400 లేదా ముప్పై శాతం కూడా దాటలేకపోతున్నది. అత్యధిక స్థానాలున్న శాసనసభల్లో మహారాష్ట్ర కోల్పోయాక కేవలం యు.పి లో మాత్రమే ఆ పార్టీ పాలన చేస్తున్నది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ప్రాంతీయ పార్టీలే పాలిస్తున్నాయి. ఇదే సమయంలో బిజెపి పాలిత యు.పి, గుజరాత్, కర్ణాటకలలో జరిగిన స్థానిక ఎన్నికలలోనూ ప్రతిపక్షాలకు హెచ్చుగానే స్థానాలు రావడం గమనార్హం. ఆఖరుకు మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి లోనూ సమాజ్‌వాది పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన ఈ దేశం వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని గౌరవించకుండా...ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే మోడీ...అనే తరహాలో ఆలోచిస్తున్న బిజెపి, ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రాలకు కోవిడ్ సహాయంలోనూ విమర్శలనెదుర్కొంది. ఎ.పి, తెలంగాణలతో సహా రాష్ట్రాల సమస్యల పట్ల ఇచ్చిన వాగ్దానాల పట్ల ఉపేక్ష ప్రదర్శించింది. స్థానిక బిజెపి నేతలు కూడా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తామని, తామే నిధులు ఇస్తున్నామని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సిబిఐ, ఇ.డి, ఎన్‌ఐఎ వంటి వాటిని ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగిస్తున్నారు. ఇవి ప్రజలు ఆమోదించడం లేదు గనకనే రాష్ట్రాల ఎన్నికలలో బిజెపిని తిరస్కరిస్తున్నారు. ఈశాన్యాన చిన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటివి మినహాయిస్తే యు.పి, గుజరాత్ మాత్రమే గతసారి బిజెపి గెలవగలిగింది. మధ్యప్రదేశ్, కర్ణాటక ఫిరాయింపుల తర్వాత తెచ్చుకుంది. బీహార్, హర్యానా, అస్సాం, త్రిపుర వంటివి ప్రాంతీయ పార్టీల తోడ్పాటుతోగాని పాలించలేని పరిస్థితి. అఖిల భారతం తమ అధీనంలోకి వచ్చేసిందని అశ్వమేధయాగం తర్వాత రాజసూయమే మిగిలిందని అనుకున్నది కాస్తా ప్రతి రాష్ట్రం బిజెపి కి సవాలుగానే మారుతున్నది. రైతాంగ ఉద్యమం, ప్రైవేటీకరణ ఆర్థిక క్షీణత, నిరుద్యోగం, అధిక ధరలు, కోవిడ్‌పై పోరులో వైఫల్యం, తగ్గని కరోనా సెకండ్ వేవ్ మరింత తక్షణ సమస్యలవుతాయి.
మమత చుట్టూ చర్చ అర్థరహితం
అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బిజెపి ఏకపక్ష పోకడలకు, మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష వేదిక గురించిన చర్చ మీడియాలో పెరుగుతున్నది. అయితే ఉద్దేశపూర్వకంగా మమత చుట్టూ ఈ చర్చ నడిపిస్తున్నారు. ఆమె గతంలోనూ అధికారంలో వున్నారు. ప్రధాని కావాలని ఆరాటపడ్డారు కూడా. మాయావతి, జయలలిత కూడా ఆ విధంగా ఆశపడిన వారే. అయితే విజయాలతో పాటు ఆయా నాయకుల విశ్వసనీయత, విధానాల సమంజసత్వం, సమతుల్యత వంటివన్నీ ప్రభావం చూపిస్తాయి. ఖచ్చితమైన ప్రజాస్వామ్య లౌకిక విలువలు సమాఖ్య తత్వం, దేశ సార్వభౌమత్వం ప్రజానుకూల ఆర్థిక విధానాలు వంటివి కొలబద్దలుగా వుంటాయి. ప్రాంతీయ పార్టీలే బిజెపిని ఓడించగలవనే పల్లవి అదేపనిగా వినిపిస్తున్నా వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్, బిజెడి, జెడిఎస్ వంటి పార్టీలు బిజెపి ని విధానపరంగా వ్యతిరేకించేందుకు సిద్ధం కావడం లేదు. రకరకాల పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఏకంగా ఎన్‌డిఎ లోనే వున్నాయి. వీటి పరిమితులను గురించి సిపిఎం వంటి పార్టీలు గతంలోనే స్పష్టంగా చెప్పాయి కూడా. ఈ పూర్వరంగంలో కేవలం ప్రాంతీయ జాతీయ జపం ఒక్కటే తీరం చేర్చదు. తనే ఇప్పటికీ పెద్ద జాతీయ పార్టీనని భావించే కాంగ్రెస్ బాగా బలహీనపడటమే గాక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేని దుస్థితిలో వుంది. కనుక రాష్ట్రాలలో ప్రజల తీర్పులు బిజెపి కి పగ్గం వేస్తున్నా కొన్ని ప్రాంతీయ పార్టీల అవకాశవాదాలు, కాంగ్రెస్ బలహీనత అది పబ్బం గడుపుకునేందుకు అవకాశమిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారానూ రాబోయే ఎన్నికలలో బిజెపి ని మరింత దీటుగా ఎదుర్కోవడం ద్వారానూ ఈ పరిస్థితిని మార్చవలసి వుంటుంది. అయిదు రాష్ట్రాల తీర్పు ఆ విధమైన చర్చకు దారితీస్తే మంచిది.
తెలకపల్లి రవి











