Sep 05,2023 22:30

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్‌: మున్సిపల్‌ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్‌ ఆయాలకు కనీస వేతనం, క్యాజువల్‌ లీవులు అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు బూర సుబ్రహ్మణ్యం మున్సిపల్‌ పాలక వర్గాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక మున్సిపల్‌ స్కూల్‌ ఆయాలు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జి చంద్రయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ మునిసిపల్‌ స్కూల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్‌ ఆయాలు స్కూలు శుభ్రం చేయడం, మంచినీళ్లు పట్టటం, ఇంటింటికి తిరిగి పిల్లలను తీసుకు రావడం, మరలా సాయంత్రం ఇంటికి పంపించడం, స్కూల్‌ గేతులకు తాళం వేసేంత వరకు స్కూల్లోనే రోజంతా గడుపుతున్న వీరికి పార్ట్‌ టైం కంటిన్యూజెంట్‌ అనే పేరుతో కనీస వేతనం అమలు చేయని పరిస్థితి ఉందన్నారు. కనీస పీహెచ్‌ వర్కర్‌ వేతనాన్ని అమలు, జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన మినిమం టైస్కేల్‌ ప్రకారం వేతనాలు అమలు చేయాలని, అలాగే మచిలీపట్నంలో 44 మంది పని చేస్తున్న స్కూల్‌ లలో ఆయాలు ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. వీరికి కనీసం నెలకు ఒక రోజు క్యాజువల్‌ లీవ్‌ అమలు చేయాలని పాలక వర్గాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఆయాలు కమిటీ అధ్యక్షురాలు కే మీనా కుమారి, కార్యదర్శి నాగమణి, కోశాధికారి వరలక్ష్మి, పుష్ప వల్లి పాల్గొన్నారు.