May 01,2022 09:18

ఎప్పటిలాగే సత్తు గిన్నెను పైకీ కిందికీ ఆడిస్తూ, అందులో ఉన్న చిల్లర డబ్బులతో శబ్దం చేస్తూ 'అయ్యా! దరమం సేయుండ్రి!' అంటూ వీధులు దాటి దుకాణాల వెంట బిచ్చమెత్తుకుంటోందా యాచకురాలు.
వారంలో ఒక్కసారి మాత్రమే యాచనకు షాపుల వైపు వస్తుంటారు బిచ్చగాళ్లు.
అందుకే బిక్షం అంటూ అటువైపు ఎవరు వచ్చినా ఎంతోకొంత దానం చేయడం అక్కడి దుకాణ సముదాయాల యజమానులకు అలవాటయ్యింది.
ఓ కిరాణా కొట్టు ముందు నిలబడి యాచిస్తోందామె. వచ్చిన జనంతో షాపు రద్దీగా ఉండడంతో ఆమెవైపు యజమాని దృష్టి పడలేదు.
మరోసారి ధర్మం చేయమని అడగబోయిన యాచకురాలు.. ఉన్నపళంగా ఆగిపోయింది అలాగే. ఆమె దృష్టి రెండు షాపుల అవతల విచారంగా నిలబడి ఉన్న ఒక కుర్రాడిపై పడింది.
అతడి వైపు తిరిగి నుదుటి దగ్గర అరచేతిని అడ్డం పెట్టుకుని తేరిపార చూసింది.
చీరపై చిరిగిన చోట ఒక గుడ్డతో అతుకు పడినట్టు.. ఆలోచనలో పడిన ఆమె మస్తిష్కాన్ని.. నెమ్మదిగా గతం కప్పేయసాగింది.
000
ఓ ఇంటి గుమ్మం ముందు నిలబడి.. 'ఓయమ్మా! దరమం సేయుండ్రి. ఆకలైతంది' అంటూ కంఠాన్ని ఆర్ధ్రతాభరితం చేసుకుని గుండె గొంతుకతో బిగ్గరగా అర్థిస్తోందొక యాచకురాలు.
తన ఆకలిని తీర్చడానికి ఎదుటివారి మనసుని కరిగించే ఆ స్వరంతో తిరిగి ఆలపించింది.
కోపం పట్టలేని పేదరికం కసిదీరా నోటితో గాట్లువేసినట్టు ఆమె కట్టుకున్న చీర అక్కడక్కడా చిరిగి ఉంది. పరిస్థితుల ప్రభావానికి బలై బక్కచిక్కిన జీవితంలా ముఖమంతా పీక్కుపోయి ఉంది.
ఆకలి కోపంగా రెండు చేతులతో బలంగా లోపలికి నెట్టినట్టు డొక్క ఈడ్చుకుపోయి ఉంది. తైలసంస్కారం లేని తలవెంట్రుకలు ఆమె అస్తవ్యస్తమైన జీవనయానంలాగే చిందరవందరగా ఉంది.
ఆ గుమ్మం ముందు వొంటరిగా ఆడుకుంటున్న పదేళ్ల చరిత్‌ ఆమెను చూడగానే తుర్రుమని ఇంట్లోకి పరుగెత్తుకుని వెళ్లాడు.
ఆ చిన్నకుర్రాడు తన అవతారాన్ని చూసి అనవసరంగా భయపడి లోపలికి పరుగెత్తాడేమోనని మనసులో కాస్తంత నొచ్చుకుందా యాచకురాలు.
పవిత్ర దేవాలయంలోని ఘంటారావాన్ని తలపింపజేస్తూ.. కుడి చేతిలోని సత్తు గిన్నెని పైకీ కిందికీ ఊపుతూ.. అందులోని చిల్లరతో ఆ ప్రాంతాన్నంతా శబ్దమయం చేసింది.
తిరిగి తన స్వరాన్ని కాస్తంత పెంచిమరీ మరోమారు దీనంగా అరిచింది 'ఓయమ్మా! దరమం సేసి పున్నెం గట్టుకోండ్రి!' అని.
లోపలి నుండి ఎవరూ బయటకు రావడం గానీ, ఎలాంటి అలికిడి కానీ వినిపించకపోవడంతో.. విసుగు చెందకుండా సహనాన్ని ప్రదర్శిస్తూ మరొకసారి జాలిగా కేకలు వేసిందా యాచకురాలు.
దయనీయమైన అర్థింపులకు గుండెలు కరిగి దయని ప్రవహింప చేసినపుడే తోచింది దానం చేస్తారని ఆమెకి అనుభవం నేర్పిన జీవిత సత్యం.
ఎవరు ముందో ఎవరు వెనకో తెలియదు. కానీ ఇందాకటి కుర్రాడితో పాటు ఇంటావిడ.. ఇద్దరూ కలిసి ఒకేసారి హడావుడిగా గుమ్మందాకా వచ్చారు.
తన తల్లి బయటకు వస్తుందని ఊహించని ఆ పసివాడు తల్లిని చూడగానే గుప్పిటతో ఉన్న చేతిని చప్పున తన వెనక్కి పెట్టేసుకున్నాడు.
అతడి కనుపాపల్లోని భయాన్ని దూరం నుంచే పసిగట్టింది ఆ యాచకురాలు.
తను కనబడగానే కొడుకు అలా చేతిని వెనక్కి దాచేయడం, కంగారు పడిపోతూ ఉన్న చోటే ఆగిపోవడం గమనించిన సంధ్య 'ఏంటీ, ఆ చేతిలో..' అంటూ గదమాయించింది.
ఆ కుర్రాడు మరింత బెంబేలెత్తిపోయాడు.
'చెప్పవేం?' అంటూ కోపంగా గుడ్లురుమి చూసింది కొడుకు వంక.
బెదిరిపోయిన చరిత్‌ ఉన్నచోటే మరింత బిర్ర బిగుసుకుపోయాడు. ఆ చిన్నవాడి నోటివెంట ఎలాంటి పలుకూ బయటకు రాలేదు.
'ఏదీ.. ఆ చేయి ఇలా చూపెట్టు!' అంటూ వెనక్కి దాచిన వాడి చేయిని దొరకబుచ్చుకొని విసురుగా ముందుకు లాగిందామె.
మూసిన పిడికిలిని తెరవకపోవడంతో తన దగ్గర ఏదో దాస్తున్నాడని కుడిచేత్తో ఆ చేయిని బలంగా అలాగే దొరకబుచ్చుకుని, ఎడమచేత్తో ఆ చిన్నారి పిడికిలిని బలవంతంగా తెరిపించింది సంధ్య.
చిన్నారి చరిత్‌ తెరిచిన అరచేతిలో ఐదురూపాయల బిళ్ల కనబడింది సంధ్యకు. ఆ బిళ్లని విసురుగా చేతిలోంచి లాక్కుంది.
'దేవుడి పటం ముందు నుంచి ఎందుకు తీసుకున్నావిది?' అంటూ కోప్పడింది.
మౌనంగా తలవంచుకున్నాడు.
'ముందు సమాధానం చెప్పు?' అడుగుతుంటే బదులివ్వక పోయేసరికి జుబ్బా పట్టుకుని ఊపుతూ రెట్టించి ప్రశ్నించింది.
సమాధానం చెప్పక తప్పింది కాదు వాడికి.
'ఆ ఆంటీకి ఇద్దామని' బెరుకు బెరుకుగా అన్నాడు తలవంచుకునే.
ఆ పసివాడి మాటలకు అబ్బుర పడింది యాచకురాలు. పెద్దదానిగా తల్లికి లేని సానుభూతి, దయాగుణం ఆ పిల్లవాడిలో ఉన్నందుకు ముచ్చట వేసింది.
'ఆంటీ..ఏంట్రా..ఆంటీ? ఆ బిచ్చగత్తె నీకు ఆంటీ ఏంట్రా?' కోపాన్ని కురిపించింది సంధ్య.
ఆ పిల్లవాడి అమాయకమైన ఆ సంబోధనకు లాగిపెట్టి చెంపమీద ఒక్కటిచ్చేదే. కానీ నిగ్రహించుకుంది.
యాచకురాలి వైపు తిరిగి కోపంగా చూస్తూ 'దుక్కలా ఉన్నావు. ఏదైనా పని చేసుకొని చావొచ్చు కదా! ఇలా ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకుంటూ బతకడం సిగ్గుగా లేదూ?' అంటూ ఉరిమింది సంధ్య.
యాచకురాలు నోరెత్తబోయి.. సంధ్య దురుసుతనానికి ఝడుసుకొని మిన్నకుండిపోయింది.
'కాయ కష్టం చేసుకోకుండా అయాచితంగా వచ్చిన డబ్బులతో హాయిగా గడపడం అలవాటైపోయింది. నిన్ను చూస్తే బాగానే ఉన్నావ్‌! కాలు, చేయి అన్నీ బాగానే ఆడుతున్నట్టున్నాయి. మరింకేం?
ఎక్కడ ఏ పని చేస్తానన్నా ఇంత ముద్ద పడేయకపోరు. ఏం? నా మొగుడు రోజంతా ఆటో నడిపి వచ్చిన డబ్బుల్ని రాత్రికాగానే తాగి తందనాలు ఆడుతూ, జల్సాలు చేస్తూ సంసారాన్ని పట్టించుకోకపోయినా, నాకు తెలిసిన పనేదో నేను చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం లేదా?' అంది..
సంధ్య మాటల ఉరుములకు ఏం మాట్లాడకుండా కొయ్యబారి పోయినట్టు అలాగే నిలబడిపోయిందా యాచకురాలు. బిక్షమెత్తు కోవడానికి ఇంటింటికీ తిరిగే రోజువారీ దినచర్యలో ఆ యాచకురాలికి ఇలాంటి ఉచిత వడ్డనలు మామూలే.
ఇక చరిత్‌ తలెత్తి తల్లివైపు చూస్తే ఒట్టు.
'పైగా చిన్నపిల్లలను బెదిరించి లోపల నుండి డబ్బులు తెమ్మని పంపిస్తున్నావా?' అరుస్తూనే కొడుకు వైపు తిరిగి 'ఏరా? బిచ్చగత్తె అడగ్గానే లోపలికి వెళ్లి డబ్బులు తెచ్చియ్యడమేనా? ఏం మీ నాన్నగానీ ఎక్కడైనా డబ్బులు దోచుకొచ్చి కుప్పలు కుప్పలు లోపల దాచి పెడుతున్నాడు అనుకున్నావా? ముందు నడువ్‌! లోపలికి..' కసిరింది సంధ్య.
'ఓయమ్మా! నేను అడుక్కొని బతుకుతున్నా! గంతేగని ఉత్తుత్తగ తిట్టి పోయకుండ్రి. సిన్న పోరగాండ్లను భయపెట్టి పైసలు తెమ్మనే కర్కోటకురాల్ని మాత్రం కాదమ్మా!' శాంతంగా అంటూ వెనుదిరిగి అక్కడ నుండి మరో ఇంటిముందుకు నడుచుకుంటూ పోయింది.
'ఆ.. తిండికీ టికానకు దిక్కు లేదు. కానీ, రోషానికేం తక్కువ లేదు' అంటూ రుస రుసలాడుతున్న సంధ్య మాటలు అక్కడి నుండి దూరంగా వెళ్లిపోతున్న ఆ యాచకురాలికి లీలగా వినబడ్డాయి.
000
పిల్లవాడు చరిత్‌ అని గుర్తుపట్టడానికి ఆమెకి పెద్దగా సమయం పట్టలేదు.
ఈలోగా అ కిరాణాకొట్టు యజమాని నుండి రూపాయి బిళ్ల సత్తు గిన్నెలో పడేసరికి ఆమె మరొక షాపు ముందుకు కదిలింది.
యధాలాపంగా ఆ యాచకురాలి దృష్టి తిరిగి ఆ పిల్లవాడి పైన పడింది. ఆ కుర్రాడు అక్కడ ఎందుకు నిలబడ్డాడో అర్థం కాలేదామెకు. పైగా అరగంట గడిచింది. ఆ షాపు ముందు నుండి కదలడూ మెదలడు.
ఏదో పోగొట్టుకున్న వాడిలా బేలగా ఓ పక్కన నిలబడి ఉన్నాడు.
ఆ కుర్రాడిపైన ఏదో అనుమానం వచ్చింది యాచకురాలికి. వెంటనే తనున్న చోట నుండి చరిత్‌కు దగ్గరగా వెళ్లింది.
'ఏం? బాబూ! గీడ నిలవడ్డ వేంది? మీ వోళ్లుగాని ఎవలైన వత్తనన్నరా!!' అతడి చెంతకు వచ్చాక ఆరా తీసిందా యాచకురాలు.
ఆ యాచకురాలి వేషధారణను గుర్తుపట్టి ఆమెను తొందరగానే పోల్చుకున్నాడు చరిత్‌. అందుకే బదులుగా లేదన్నట్టు అడ్డంగా తలూపాడా చిన్నోడు.
'గట్లైతే గీడెందుకు నిలవడ్డవు?' తిరిగి ప్రశ్నించింది.
ఆమెకు చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడా కుర్రాడు.
అతడి సంశయాన్ని గమనించి 'నా కాడ దాసిపెట్టకు. ఇసయం సెప్పు' అనడిగింది.
అయినా ఆ పిల్లవాడు భయంతో బిగుసుకుపోయి నిలబడి ఉన్నాడు తప్ప నోరు మెదపలేదు.
'సిన్నా! నువ్వేం గుబులు పడకు. నాకాడ నువ్వేం చెప్పినా మీ యమ్మకు తెల్వదులే..' అంది.
అలా నచ్చజెబితేనైనా ఆ కుర్రాడు విషయం బయట పెడతాడేమోనని.
'అదీ... అదీ...' అంటూ విషయం పూర్తిగా చెప్పకుండానే మాటను సగంలోనే మింగేశాడు.
'సెప్పు బాబూ! నీకేం గాదు..'
అడగకుండానే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు చేసుకుని ఆ దినం ఐదు రూపాయలు దానం చేయబోయిండు. అలాంటి మంచి మనసున్న ఆ చిన్నోడికి... తనవంతుగా ఏదైనా సహాయం చేయాలని అనిపించిందా యాచకురాలికి.
'వూ...సెప్పు...'
'మరే... ఉప్పు, పప్పు, కారం, నూనె తెమ్మని వంద రూపాయల నోటిచ్చింది అమ్మ. కిరాణాషాపుకి వచ్చేసరికి ఎక్కడ పోయిందో మరి. అది కనబడడం లేదు' బిక్కముఖం వేసుకుని ఏడుపు గొంతుతో విషయం వెల్లడించాడా పసివాడు.
'గా సామాను కొనుక్కొని ఇంటికి తీస్కపోకపోతే మీయమ్మ కొడతది గంతే గదా!' అనడిగింది.
అవునన్నట్టు తలూపాడు.
'గట్లైతేగా నూర్రూపాయలు నేనిత్తలే!.. మీ యమ్మ సెప్పింది కొనుక్క పోదువులే' భరోసా ఇచ్చింది.
చిన్నారి చరిత్‌ కళ్లు మిలమిలా మెరిసాయి. ముఖం కొండంత వెలిగి పోయింది.
ఇంతలోనే ఏమైందో ఏమో వాడి వదనంలోని ఆనందం మటుమాయమైంది.
'నువ్వెందుకిస్తావు?' అంటూ ప్రశ్నించాడు.
'మొన్న మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి దానం సేయుమని నేనడిగినప్పుడు నువ్వేం జేసినవ్‌! ఇంట్లకురికి నాకిద్దామని ఐదు రూపాయల బిల్ల తెచ్చినవా, లేదా?'.
'నువ్వు ఆకలవుతుందని చెప్పావు కదా! అందుకని తెచ్చాను' అన్నాడు అమాయకంగా.
ఇంత చిన్న వయసులో ఆ పిల్లవాడి మనసులో ఉన్న దయాగుణానికి ముచ్చటేసింది యాచకురాలికి.
'నీకిప్పుడు అవుసురం వుంది గద. గందుకని నేనిత్తన్న. ఇగో తీసుకో 'అంటూ బొడ్లోంచి చిన్న బట్ట సంచి తీసి అందులోంచి పది, ఇరవై నోట్లు లెక్కపెట్టి వంద రూపాయలు కుర్రాడికి ఇవ్వబోతే చేయి ముందుకు చాచలేదా కుర్రాడు.
'అమ్మో! నిన్ను ఆంటీ అన్నందుకే అమ్మ కోప్పడింది. ఇంక నీ దగ్గర డబ్బులు తీసుకున్నానంటే చితక బాదుతుంది' అన్నాడు వెంటనే.
ఆ కుర్రాడి మాటలకు, అతడి వ్యక్తిత్వానికి మరింత ఆశ్చర్యం వేసిందా యాచకురాలికి.
'పైసల్‌ నేనిచ్చిన్నని మీ యమ్మకెట్ల తెలుత్తది?' అనడిగింది. ఆ కుర్రాడి మనసులో ఏముందో తెలుసుకోవాలని.
ఏం చెప్పాలో తోచక అమాయకంగా అటూ ఇటూ చూపులు సారించాడు.
'సిన్నా! గసువంటియి మనుసుల వెట్టుకోకు. పైసల్‌ పోయినయని మీ యమ్మకు సుతం నువ్వు సెప్పకు. గట్లనే నేనిచ్చిన్నని గూడ సెప్పకు. గంతే! అయిపాయె!' ఆ చిన్న పిల్లవాడికి ఎలాగైనా సహాయం చేయాలనిపిస్తోందా యాచకురాలికి.
అందుకే బలవంతంగా వాడి చేయి లాగి వంద రూపాయలను పెట్టబోయింది. గబుక్కున చేయి వెనక్కి లాక్కున్నాడా కుర్రాడు.
కాసేపు ఆలోచనలో పడ్డ చరిత్‌ తన బుల్లి నోరు తెరిచాడు.
'ఆంటీ! అమ్మ తిట్టినా కొట్టినా సహిస్తాను. కానీ అమ్మతోని అబద్ధం చెప్పను. ఏదైతే అది అయ్యిందిలే! డబ్బు పోగొట్టుకున్నాననే చెబుతాను. అయాచితంగా వచ్చే నీ వంద రూపాయలు నాకు వద్దులే!' అంటూ కరాఖండిగా చెప్పేశాడా అబ్బాయి.
నోరు తెరిచి స్థాణువైపోయిందా యాచకురాలు. తనలో తాను ఆలోచనలో పడింది.
ఆకస్మికంగా జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో తన వాళ్లతో పాటు సర్వస్వాన్నీ కోల్పోయి.. బంధువుల ఛీత్కారంతో ఊరు వదిలి రావాల్సి వచ్చిన తను.. ఏ పనీ దొరకక ఇలా యాచనకు దిగాల్సి వచ్చింది.
'ఇంత చిన్న వయసులో ఊరికే వచ్చినా డబ్బులు తీసుకోవడం లేదా చంటోడు. అలాంటిది ఏదో ఒక పని చేసుకుంటూ స్వతంత్రంగా తను బతకలేదా?' మొదటిసారి ఆత్మవిశ్వాసపు భావనలు మెల్లమెల్లగా ఆమె మనసుకి మొగ్గలు తొడుగుతున్నాయి.
ఆమె తలతిప్పి ఏదో చెప్పేలోగానే తలదించుకుని వేగంగా కదలిపోయాడా పసివాడు..
000
పదో తరగతి చదువుతున్న చరిత్‌ కాయగూరల కోసం మార్కెట్‌కి వచ్చాడు.
మార్కెట్‌లోకి ప్రవేశించిన వాడల్లా 'వంకాయలు.. బెండకాయలు.. బీరకాయలు..' అని అరుస్తూ పిలుస్తున్న మహిళ వైపు చూశాడు.
ఆమెని ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపించి చప్పున అక్కడే ఆగిపోయాడు. స్ఫురణకు వచ్చిందతనికి. ఆమె కూడా చరిత్‌ని గుర్తు పట్టినట్టుంది.
'మంచిగున్నవా బాబూ!' అని అడిగింది.
చరిత్‌ దగ్గరకు రాగానే ముందున్న కూరగాయలు తీసి చేత్తో పట్టుకుని 'తీసుకో బాబూ!' అంది.
ఆమె వాలకం గమనించిన చరిత్‌ 'డబ్బులు తీసుకుంటేనే!' అన్నాడు.
'సిన్న పిలగానప్పుడే అడుక్కునుడు పనికిరాదంటూ నాకు బుద్ధి నేర్పినోడివి. నువ్వు జేయవట్టే తోసినకాడికి గిట్లయేదో వొక పని సేసుకుంట.. వొగల్ల నుంచి ఏదీ ఆశపడకుంట... గిట్ల బతుకుతున్న. కాదనకు బాబూ!' ప్రాధేయపడింది.
'అయాచితంగా అయితే వద్దులే!' తిరస్కరించాడు నిర్మొహమాటంగా.
ఏమనుకుందో ఏమో 'గట్లనే తిరు!' అంది.
జేబులోంచి డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టి కూరగాయలు సంచిలో వేసుకుని ముందుకు కదిలాడు చరిత్‌.
- ఎనుగంటి వేణుగోపాల్‌
9440236055