Oct 06,2023 14:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పశువులకు ఆయా కాలాలలో వచ్చే వ్యాధుల నుంచి సంరక్షించుకునేందుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆకేపాడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు పశువిజ్ఞానబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొర్రెలు, మేకల యజమానులను పిలిపించి పశువుల పెంపకం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయభాస్కరరావు మాట్లాడుతూ జీవాలలో ప్రస్తుతం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. జీవాలలో వచ్చే పి.పి.ఆర్, నీలి నాలుక, బొబ్బ, చిటుక వ్యాధి వంటివి రాకుండా టీకాలు అందుబాటులో ఉన్నాయని, పశు యజమానులు వీటిని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డి వార్మింగ్ ఇప్పించాలని అన్నారు. సహాయ సంచాలకులు డాక్టర్ కే ప్రతాప్ మాట్లాడుతూ గొర్రెల పెంపకం దారులు ఒక గ్రూపుగా ఏర్పడాలని సూచించారు. గ్రూపులో కనీసం 15 మంది సభ్యులు ఉండాలని, ఒక రెవెన్యూ గ్రామానికి ఒక గ్రూపును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 1962 నెంబర్ కు ఫోన్ చేసి పశువులకు అంబులెన్స్ సేవలు పొందవచ్చునని అన్నారు. పశువుల మేతకై దానామృతం సబ్సిడీ ద్వారా కిలో  రూ 6.50 పైసలకు అందుబాటులో ఉందని, గొర్రెల పెంపకం దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి, రాజంపేట పశువైద్యశాల జె వి ఓ ఎం.వరదయ్య, ఆకేపాడు పశువైద్య సహాయకులు కుమారి, పూజా ప్రియాంక, గ్రామస్థులు పాల్గొన్నారు.