Jul 20,2023 19:45

దినేష్‌ (ఫైల్‌)

ప్రజాశక్తి-తాడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ యువకుడి కుటుంబం అవయవదానికి ముందుకు వచ్చింది. దీంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపినట్లయ్యింది. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ విద్యాధరపురానికి చెందిన టి.దినేష్‌ (22) రోడ్డు ప్రమాదానికి గురవడంతో తలకు బలమైన గాయం తగిలింది. మణిపాల్‌ ఆసుపత్రికి తరలించగా వైద్యులు క్రేనియోటమి శస్త్రచికిత్స చేశారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. మిగతా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్‌ డెడ్‌గా పరిగణించారు. దినేష్‌ అవయవ దానానికి భార్య వసంత, తల్లిదండ్రులు సుశీల, ఏడుకొండలు అంగీకారం తెలపడంతో జీవన్‌ధాన్‌ చైర్మన్‌ కె.రాంబాబు, ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. కాలేయం, కిడ్నీని మణిపాల్‌కు, కళ్లు, సికింద్రాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు, ఊపిరితిత్తులు కిమ్స్‌ ఆసుపత్రికి, ఒక కిడ్నీ విజయవాడలోని విజయ ఆసుపత్రికి తరలించారు.