Jun 23,2023 00:42

వివరాలు వెల్లడిస్తున్న విమ్స్‌ డైరెక్టర్‌ రాంబాబు

ప్రజాశక్తి - అరిలోవ : ప్రమాదవశాత్తు బహుళ అంతస్తుపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అవయవాలను విమ్స్‌ ఆసుపత్రికి మృతుని బంధువులు దానం చేయడంతో ఐదుగురికి ప్రాణ భిక్ష లభించింది. ఆరిలోవకు చెందిన వెంకట సంతోష్‌కుమార్‌ (32) ఒక భవనం రెండవ అంతస్తులో ఏసీ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని బంధువులు విమ్స్‌ ఆసుపత్రికి అవయవ దానం చేయాలని నిర్ణయించారు. విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు ఆధ్వర్యాన నిష్ణాతులైన శస్త్ర చికిత్స నిపుణులు ఆలస్యం చేయకుండా మృతునికి చెందిన రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు కార్నియల్‌ను సేకరించారు. దీనిపై విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. సేకరించిన ఐదు అవయవాలు చట్టబద్ధంగా జీవనధాన్‌ పోర్టర్లో అవయవాల కోసం నమోదు చేసుకున్న ఐదుగురు సీనియర్‌ రోగులకు సకాలంలో అందించామన్నారు. ఈ అవయవ దానం వల్ల ఐదుగురు ప్రాణాలు కాపాడగలిగామన్నారు. అవయదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. అవయవదానం చేసిన మృతుని బంధువులకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే జీవన్‌ ధాన్‌ పోర్టల్లో 2900 రోగులు పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో1900 మందికి మూత్రపిండాలు, 700 మందికి కాలేయం, మిగిలిన వారికి ఇతర అవయవాలు అవసరమని తెలిపారు. బ్రెయిన్‌ హేమరేజ్‌తో మృతి చెందిన వెంకట సంతోష్‌కుమార్‌కు చెందిన ఒక మూత్రపిండాన్ని అపోలో ఆసుపత్రికి, మరొక మూత్రపిండాన్ని కిమ్స్‌ ఆసుపత్రికి, కాలేయం పినాకిల్‌ ఆసుపత్రికి, రెండు కార్నియాలను ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రికి అందజేశామని చెప్పారు.