ప్రజాశక్తి-గుంటూరు: అవయవ దానం చేయటం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొంతమందిని కాపాడగలుగుతామని సర్వీసు హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి.సేవాకుమార్ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒలో మానవత సంస్థ ఆధ్వర్యంలో అవయవదానం అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చనిపోయిన వారి మృత శరీరాలు వైద్యకళాశాలలకు ఇవ్వటం వల్ల విద్యార్థులు వారి పరిశోధనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రస్తుత ఆధునిక యుగంలో అవయవ మార్పిడి సులభతరం అయ్యిందన్నారు. బతికి ఉన్న వారు కూడా లివరు, కిడ్నీ లాంటి కొన్ని అవయవాలు దానం చేయొచ్చని వివరించారు. సమావేశానికి మానవత సంస్థ అధ్యక్షులు నల్లమోతు రామారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తమ సంస్థ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అవయవదానంపై కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పట్టు పరిశ్రమ అదనపు డైరెక్టర్ సిహెచ్.అరుణకుమారి అవయవదానం, రక్తదానం ప్రాధాన్యతను వివరించి, మానవత సంస్థకు రూ.10 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో మానవత చైర్మన్ పి.రమేష్ ప్రసంగించారు. అనంతరం మార్చురీ వాహనానికి రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన వి.వి.నాగిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ సంస్థ అధ్యక్షులు ఎన్.అరవింద్, లోక్‌సత్తా నాయకులు యు.సదాశివరావు, మానవత సంస్థ కార్యదర్వి వై.రమణబాబు, డైరెక్టర్ ఉప్పాల సాంబశివరావు పాల్గొన్నారు.










