కోడి కూత కూయగానే మూలుగుతూ లేచింది అరవయ్యేళ్ల కాంతమ్మ. కాలకృత్యాలు పూర్తి చేసుకొని మనవణ్ణి లేపింది. ఏడేళ్ల మనవడు లేచినా చేసేదేమీ లేదు. అయినా నిద్రలేపడం తప్పదుగా. ఆ రెండు ప్రాణులూ, రెండు గోవులూ తప్ప మరోజీవి ఉండదు ఆ గుడిసెలో. అది ఒక కుగ్రామం. పది పదిహేను గుడిసెలు, చెరువు, మర్రిచెట్టు, కిరాణా కొట్టు తప్ప ఇంకేమీ లేవు అక్కడ. గ్రామం చుట్టూ దట్టమైన అడవి. కట్టెలు కొట్టుకొని ఓ రెండు కిలోమీటర్ల దూరానున్న పట్టణానికిపోయి అమ్ముకోవడం ఆ గ్రామస్తుల వృత్తి.
బిడ్డని ప్రసవించి పురిట్లోనే కన్ను మూసింది కోడలు. పుట్టగానే తల్లిని మింగేశాడని నిందిస్తూ ఏడాది తిరగక్కుండానే మరోకామెను పెళ్లి చేసుకున్నాడు. తల్లినీ, బిడ్డనే కాకుండా ఊరినే విడిచిపెట్టి వెళ్లిపోయేడు కన్నకొడుకు. గత్యంతరం లేక రోజూ పొరుగునున్న పట్టణానికి వెళ్లి పాలు, పిడకలు అమ్ముకుంటూ మనవణ్ణి చూసుకుంటూ ఎలాగో బతుకు బండి లాక్కుంటూ వస్తోంది ఆ అవ్వ.
కొంతకాలానికి ఆమెకొక భయంకర నిజం తెలిసింది. మనవడు మాటలు కూడా సరిగా రాని వెర్రిబాగులోడని. తోటి పిల్లలంతా వాడ్ని ''ఒరేరు వెర్రోడా, పిచ్చోడా'' అని పిలిచినా పలికేవాడు. అవ్వ మాత్రం ముద్దుగా వాడ్ని ''నాని'' అని పిలుచుకునేది. ఆకలేస్తే అవ్వని పిలిచి బువ్వ పెట్టమనడం, మిగతా సమయంలో చెరువు గట్టు వొడ్డున కూర్చొని చెరువులోకి రాళ్లు విసరడం తప్ప వేరే ఆట తెలీదు వాడికి. ఎక్కడైనా ఏదైనా వస్తువు దొరికితే తెచ్చి నేరుగా అవ్వకే ఇస్తాడు. ఇంకెవ్వరికీ చచ్చినా ఇవ్వడు. లడ్డూలంటే ప్రాణం. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు వాడిచేత అప్పుడప్పుడు చిన్నచిన్న పనులు చేయించుకొని, ఓ లడ్డూ చేతిలో పెడుతూ ఉంటారు. చదువు ఎలాగో అబ్బదు. చిన్న చిన్న డబ్బు లెక్కలు నేర్పుదామని విఫల ప్రయత్నం చేసింది పాపం అవ్వ. ''రూపాయికి ఎన్ని పైసలురా?'' అని అడిగితే ''మూడు'' అంటాడు. ఒకసారి బాగా కొట్టింది అవ్వ. అప్పటి నుంచి ''నూరు'' అనేవాడు. అప్పుడప్పుడు వాడి చేతిలో ఎంతోకొంత డబ్బు పెట్టి, కొట్టుకెళ్ళి చిన్నచిన్న వస్తువులు తెమ్మనేది. వాడికి లెక్క తెలీదని తెలిసినా ఎవరూ మోసం చేసేవారు కాదు. వెర్రివాడైనా అబద్ధం మాత్రం ఆడేవాడు కాడు. చూసినది చూసినట్టు చెప్పడం మాత్రం తెలుసు.
ఆ గ్రామంలో ఉన్న చెరువు గట్టును ఆనుకొని రాష్ట్రీయ రహదారి ఉంది. ఆ రోడ్డు మీద ఉన్న మైలురాయి మీద కూర్చొని, వచ్చే పోయే వాహనాల్ని వింతగా చూస్తూ.. గంతులేస్తూ ఉండేవాడు నాని. ఒకరోజు ఐదారు కార్లు, మోటారు సైకిళ్ళు ఆ గ్రామంలోకి వచ్చాయి. అది ఎన్నికల సమయం. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు వారి అభ్యర్థికే ఓటు వేయాలని చెబుతూ నోట్లు పంచి, తిరిగి వెళుతున్నారు. నాని కూర్చున్న మైలురాయి దగ్గర పెద్ద గొయ్యి ఉంది. చీకటి పడుతున్న సమయం కావడంతో గొయ్యి కనపడక ఒక మోటారు సైకిలు నడిపే వ్యక్తి జారిపడ్డాడు. అప్పుడు అతని జేబులోని ఒక ప్యాకెట్ జారి కిందపడింది. అది గమనించకుండానే వారు వెళ్లిపోయారు. దానిని నాని చూశాడు. వెంటనే అవ్వకి తెచ్చిచ్చాడు. ఆ ప్యాకెట్టు విప్పి చూసిన అవ్వ అవాక్కయింది. అందులో దాదాపు లక్ష రూపాయలు ఉన్నాయి. అది పారేసుకున్నవాడు వెతుక్కుంటూ తిరిగి వస్తే ఇచ్చేద్దామని అనుకుంది. కానీ కొంత సమయం తర్వాత మనసు మార్చుకుంది. అది ఎలాగూ అక్రమ సొమ్మే. డబ్బు పంచి పెడుతున్నవాడు ఒక పార్టీ కార్యకర్త. ఓటుకు నోటు పంచి పెట్టడం అన్యాయమే. తనుగాని, నానిగాని దొంగతనం చెయ్యలేదు. అక్రమ సొమ్ము మనకెందుకని న్యాయంగా ఇచ్చేసినా, ఆ డబ్బు అసలువానికి చేరేదీ లేదు. మధ్యలో కార్యకర్తలే తీసుకుంటారు.
కొడుకుని కని కోడలు పైలోకానికి వెళ్లిపోయింది. దురదృష్టవసాత్తూ వాడు వెర్రివాడు అయ్యాడు. ఆ వెర్రి మనవణ్ణి పెట్టుకుని జీవిత రథాన్ని లాగడం కూడా ఇకమీద కష్టమే. తన తదనంతరం వాడి గతేమిటి? అన్న ఆలోచన తనని రోజూ వేధిస్తూనే వుందన్నది వాస్తవం. ఇది తనకు లభించిన మంచి అవకాశం అనుకుంది.
ఇప్పుడొచ్చింది అసలు చిక్కు అవ్వకి. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి గ్రామస్తుల్ని ప్రశ్నించవచ్చు. నానినీ అడగవచ్చు. వాడు నిజం చెప్పేస్తాడు. కాబట్టి తప్పించుకోడం ఎలా? అని ఆలోచించింది అవ్వ. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. చీకటిపడక ముందే నానికి భోజనం పెట్టి పడుకోబెట్టింది. వాడికి లడ్డూలంటే చాలా ఇష్టమని గంపెడు లడ్డూలు చేసింది. వాకిటినిండా ఒంపేసింది. ఆ తరువాత 'ఒరేరు.. నానిగా .. లేవరా, లడ్డూల వర్షం పడిపోతోందిరా!' అంటూ నిద్ర లేపింది. అది నిజమని నమ్మిన నాని లడ్డూలు ఏరుకుంటుంటే, వాడి తలమీద మరికొన్ని లడ్డూలు ఒంపేసింది. కడుపునిండా తిని, నాని మరలా నిద్రలోకి జారుకున్నాడు. వాడు పడుకున్నాక ఆ డబ్బును భద్రమైన స్థలంలో దాచిపెట్టింది.
ఊహించినట్టే జరిగింది. మరునాడు ఉదయాన్నే వాళ్ళు ఆ గ్రామానికి వచ్చారు. గ్రామస్తులందరినీ ప్రశ్నించారు. ఆ ప్యాకెట్టు అప్పజెప్తే బహుమానం కూడా ఇస్తామన్నారు. అవ్వ ఆ సమయంలో ఇంట్లో లేదు. నాని యథాప్రకారం మైలురాయి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. గ్రామస్తుల నుండి ఆశించిన జవాబు రాకపోవడం వల్ల నిరుత్సాహంతో తిరుగు ప్రయాణమయ్యారు వాళ్ళు. మైలు రాయి వద్ద కూర్చొనివున్న నానీని చూసి, వాడు వెర్రివాడని తెలీక ''నీకేదైనా ప్యాకెట్టు దొరికిందా?'' అని అడిగారు. దొరికితే అవ్వకిచ్చానని చెప్పాడు. అవ్వ దగ్గరకు వాళ్లని తీసుకెళ్లాడు.
''ఏ అవ్వా ఏదా ప్యాకెట్టు?'' అని అడిగాడు ఒకడు.
''ఏ ప్యాకెట్టండీ?'' అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ అవ్వ.
''అదేనమ్మా నీ మనవడు నీకు ఇచ్చాడట'' అది.
''నాకే ప్యాకెట్టూ ఇవ్వలేదు బాబూ వాడు'' అంది ఏమాత్రం తడబడకుండా.
''నీకు ఇచ్చానని చెబుతున్నాడు వాడు?''
''లేదు బాబూ వాడికేం తెలీదు. వాడు వెర్రివాడు బాబూ'' అంది.
''హే అవ్వకిచ్చేను'' అన్నాడు నానిగాడు వెకిలి నవ్వు నవ్వుతూ.
''చూడు అవ్వా మర్యాదగా ఇచ్చేరు'' అన్నాడు వాళ్లలో ఒకడు.
''నాకివ్వలేదంటున్నానుగా బాబూ, పోనీ ఎప్పుడిచ్చాడో అడగండి వాడిని'' అంది.
''ఒరేరు బాబూ ఎప్పుడిచ్చావురా?'' అని అడిగారు.
''మరే ఆ పొద్దు లద్దూల వచ్చం పడింది కదా! అప్పుడిచ్చాను'' అన్నాడు నానిగాడు.
''ఏంటీ లడ్డూల వర్షమా?''
''మరి అదేనండి నేను చెప్పేది. ఎప్పుడైనా లడ్డూల వర్షం పడుతుందాండి? వాడు వెర్రివాడండి
బాబూ. వాడిమాట నమ్మకండి. ఏ ప్యాకెట్టూ లేదు నా దగ్గర.'' అంది అవ్వ తెలివిగా.
''వెర్రివాడి వింత మాటలు విని, వెర్రిమొహం వేసుకొని వెనుదిరిగారు వాళ్ళు చేసేదేమీలేక.
వారి బారి నుండి తప్పించుకొని, డబ్బుల మూట దక్కించుకుంది అవ్వ. కానీ అక్రమ సొమ్ము సొంతం చేసుకోవాలన్న దురాలోచన ఎంత మాత్రం లేదు ఆమెకు. ఉపాయం ఆలోచించసాగింది.'నేనా కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్నాను. ఏ క్షణాన్నయినా పిలుపు రావచ్చు. నేనూ గుటుక్కుమంటే ఆ వెర్రోడి గతేమిటి? వాడు ఎలా బతుకుతాడు? వాడ్ని కన్న తండ్రే వదిలేసిపోయాడు. పరాయివాళ్ళు ఎవరు చూస్తారు? అందుకే నాకీ దారి కనబడిందేమో!' అనుకుంది అవ్వ.
ఆవుని, గుడిసెని అమ్మేసింది. దొరికిన డబ్బుల మూటనూ, చిన్నాచితకా సామాన్లనూ, నానీని తీసుకొని గ్రామం విడిచి పట్నానికి వెళ్లింది. అక్కడ అనాథాశ్రమం చేరుకుంది. దొరికిన సొమ్ము లక్ష రూపాయలు ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేస్తూ ఒక కోరిక కోరింది. తనకూ, మనవడికీ జీవితాంతం ఆ ఆశ్రమంలో చోటు ఇవ్వాలని, తన మరణానంతరం కూడా మనవడికి ఏ లోటూ లేకుండా చూసుకోమంది.
* భాగవతుల సత్యనారాయణ మూర్తి, 9440871667