
ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడ ఆర్టీసి బస్‌స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ఔట్‌సోర్సింగ్ కార్మికుడు ఎడ్లపల్లి వీరయ్య కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం గుంటూరు ఆర్టీసి డిపో మేనేజర్, ఏటిఎం అధికారులకు సిఐటియు నాయకులు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్టీసి యాజమాన్యం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయటం తప్ప, మిగిలిన రోజుల్లో అవుట్‌సోర్సింగ్ కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు. వీరయ్య కుటుంబానికి పరిహారం అందించాలని, ప్రమాదంలో కాలు విరిగిన మరొక ఔట్‌సోర్సింగ్ కార్మికుడు సురేష్‌కు మెరుగైన వైద్యంతోపాటు, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా చైర్మన్ బి.లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు రామకృష్ణ, ఆర్.ఎస్.రావు, శ్రీనివాసరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.