
ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా జేఏసీ అమరావతి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు, ఎఐటియుసి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియారిటీ అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. ఏపీ అమరావతి జేఏసీ అనకాపల్లి యూనిట్ అధ్యక్షులు సింగంపల్లి వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి లోవరాజు, ఏపీ ఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షులు పి రత్నం, కార్యదర్శి వై శ్రీరామ్ మూర్తి, కేజీబీవీ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌బిటిఎస్ దేవి, ఏపీ వర్క్స్ ఆర్ట్స్, పిఈటి సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఏపీఎస్‌ఆర్టీసీ యూనియన్ జిల్లా కార్యదర్శి డిఎన్ మూర్తి, ఆరోగ్య శాఖ నుంచి నాని, ఏపీ లేబర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీయల్ స్టాఫ్ అధ్యక్షులు కే ప్రభాకర్ రావు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ వివి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కోన లక్ష్మణ, ఎల్‌వి రమణ, పంచాయతీరాజ్ శాఖ నుంచి వి.దేవి వరప్రసాద్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కే అప్పారావు ప్రసంగించారు.