Dec 06,2022 23:43

జివిఎంసి జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-అనకాపల్లి
జివిఎంసి ప్రజారోగ్య విభాగంలోని పొరుగు సేవ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏర్పడిన ఖాళీ పోస్టులను ఎపిసిఒఎస్‌ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ స్థానిక జోనల్‌ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంటా శ్రీరామ్‌ మాట్లాడుతూ అనకాపల్లి జోన్లో 170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులను రిటైర్మెంట్‌ అయిన వారి, మృతి చెందిన, సిక్‌ లీవ్‌ రిటైర్మెంట్‌ అయిన వారి వారసులతో భర్తీ చేయాలని కోరారు. పొరుగు సేవలు పేరుతో బయటి వారిని నియమిస్తే ఊరుకునేది లేదని, సమ్మె చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. అనంతరం జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎ.బాలకృష్ణ, వై.ఏసురాజు, పి.గోవింద, ఆర్‌.సత్యనారాయణ, బి నాగరాజు, బొమ్మల రాము, వాసు, అజరు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.