May 02,2023 21:19

కార్యాలయంలో అడుగు మేర నిలిచిన వర్షపు నీరు



అవుకులో భారీ వర్షం
- తడిసి ముద్దయిన సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం
- భవనంలో నిలిచిన అడుగు మేర నీరు
- ఆగిన రిజిస్ట్రేషన్‌ సేవలు - ఇబ్బందుల్లో ప్రజలు
ప్రజాశక్తి - అవుకు

      అవుకు పట్టణంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా నాలుగు గంటల పాటు కురిసింది. శిథిలావస్థకు చేరుకున్న సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం తడిసి ముద్దయింది. ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో మంగళవారం రిజిస్ట్రేషన్‌ల కోసం ప్రజలు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఉన్నట్లుండి వర్షం రావడంతో అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం పై కప్పు నుండి నీరు కారి పూర్తిగా తడిసిపోయింది. కార్యాలయంలో అడుగు మేర వర్షపు నీరు నిలువ చేరింది. కార్యాలయంలో ఉన్న రికార్డులు, కంప్యూటర్లు తడవకుండా అధికారులు ప్లాస్టిక్‌ పట్టాలను కప్పారు. 1905లో నిర్మించిన ఈ భవనానికి 118 ఏళ్లు పూర్తయ్యాయి. అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఈ కార్యాలయాన్ని ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు చేయడం లేదు. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. వర్షం పడితే చాలు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం మొత్తం చిత్తడి చిత్తడిగా మారుతుంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఇలాంటి కార్యాలయంపై కన్నెత్తి కూడా చూడకపోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండల ప్రజలు పేర్కొంటున్నారు. రాష్ట్రం మారినా, జిల్లా మారినా అవుకు రిజిస్టర్‌ కార్యాలయం పరిస్థితి మాత్రం ఏమీ మారడం లేదని సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయ భవనాన్ని నూతనంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.