అవుకు రిజర్వాయర్ బోటు కాంట్రాక్టర్, డ్రైవర్ అరెస్టు
ప్రజాశక్తి బనగానపల్లె
అవుకు రిజర్వాయర్‌లో నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా బోటును నడిపి ముగ్గురి మృతికి కారకులైన బోటు కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు, బోటు డ్రైవర్ శ్రీనివాసరావులను అరెస్టు చేసినట్లు డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న అవుకు రిజర్వాయర్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోటును నడిపి కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ఎస్బి కానిస్టేబుల్ దూదేకుల రసూల్ కుటుంబ సభ్యులైన దూదేకుల ఆసియా భాను, దూదేకుల నూర్జాహన్, దూదేకుల సాజిదా మృతికి కారణమైన కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు, బోటు డ్రైవర్ శ్రీనివాసరావులను అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. 2018లో తాడిపత్రికి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు రెస్టారెంట్ రిజర్వాయరులో బోటు నడిపేందుకు ఎపి టూరిజం శాఖ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నట్లు చెప్పారు. ఈ కాంట్రాక్టు 2023 సెప్టెంబర్ 24 వరకు ఉన్నట్లు తెలిపారు. బోటును నడిపేందుకు బోటు సేఫ్టీ సంబంధించి కాకినాడ పోర్టు ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. 2021 వరకు కాకినాడ పోర్టు ద్వారా బోటు నడిపేందుకు కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు అనుమతులు తీసుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత బోటు నడిపేందుకు రెన్యువల్ చేసుకోలేదన్నారు. ఈ నెల 14న ఎస్బి కానిస్టేబుల్ రసూల్ కుటుంబం 12 మంది అవుకు రిజర్వాయరులో బోటు వివాహారయాత్ర కోసం బయలుదేరారని, బోటు డ్రైవర్ పాటు అసిస్టెంట్ లేకుండా ఒక్కరే లోపలికి తీసుకెళ్లారని, బోటులో ఉన్నవారికి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదన్నారు. బోటులోకి నీళ్లు రావడంతో డ్రైవర్ ప్రయాణికులను రక్షించకుండా బోటు నుండి దూకి పారిపోవడంతో బోటు బోల్తా పడి ఆసియా భాను, నూర్జాహన్, సాజిదా మృతి చెందారని తెలిపారు. కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు బోటుకు రెన్యువల్ తీసుకపోవడం, బోటు డ్రైవర్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా నడిపి ముగ్గురి మృతికి కారణం కావడంతో వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సిఐ ప్రియతం రెడ్డి, అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.










