Feb 21,2021 06:52

'చదివేస్తే ఉన్న మతి పోయింద'ని సామెత. ఢిల్లీ గద్దె మీద కూచొని ఏలుబడి సాగిస్తున్న మోడీ ప్రభుత్వ తీరు అచ్చం ఇలాగే అఘోరిస్తోంది. ఆవు పేరుతో సెంటిమెంట్లను రెచ్చగొట్టటం, రాజకీయాలను నడపడటమే కాదు; దానికి లేనిపోని మహత్తులను ఆపాదించి, తరతరాలుగా సత్యశోధకులూ, శాస్త్రవేత్తలూ సాధించిన విజ్ఞాన ప్రగతిని కూడా అపహాస్యం చేస్తోంది. ఆధారాల్లేని అశాస్త్రీయ నమ్మకాలనే ఇప్పుడు విశ్వవిద్యాలయ కోర్సులుగా చెలామణి చేయటానికి బరి తెగిస్తోంది.


మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలూ వంటి పశుసంతతి వ్యవసాయ పురోగతికి ఎంతగానో దోహదపడ్డాయి. వాటిని ప్రేమగా సాకటం, సందర్భానుసారం వాటి సేవలను వినియోగించుకోవటం ఈ గడ్డ రైతు బిడ్డలకు బాగా తెలుసు. ఆవుతో సహా అన్ని పశువులూ పాడిని ఇవ్వటానికో, సేద్యం సాగించటానికో మాత్రమే పనికొస్తాయని వాటిని అనుక్షణం పెంచి పోషించే కర్షకులకు సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. అంతకుమించిన ఘనతతో, గొప్పనో వారెప్పుడూ గోవుల్లో చూడలేదు. పశుపోషణతో, పాలనతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రబుద్ధులు మాత్రం గోమహత్తు పేరిట గోలగోల చేస్తున్నారు. ఆవుమూత్రం సేవిస్తే సర్వరోగాలూ పటాపంచలైపోతాయని దేశం దద్దరిల్లిపోయేలా ప్రసంగాలు చేసే బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగు... ఇప్పుడు అనారోగ్యం పాలై ఎయిమ్స్‌లో ఆధునిక వైద్య చికిత్స పొందుతోంది. ఆవు పేడ పులుముకుంటే కరోనా దరిదాపులకు రానేరాదని డప్పాలు కొట్టిన బాపతంతా ఆ వైరస్‌ సోకగానే వాలింది ఆధునిక వైద్యం వాకిట్లోనే! గోమూత్రం గురించి గొప్పలు ప్రవచించే రామ్‌దేవ్‌ ప్రభృతులు ఆరోగ్యం చెడినప్పుడు ఆశ్రయించింది శాస్త్రీయ వైద్యాన్నే! ఇలాంటి ఉదాహరణలు ఇంకా బోలెడన్ని చెప్పొచ్చు. ఏతావాతా తేలేది ఏమంటే - ప్రజలను మూఢత్వంలో మునిగించి, తాము అధికారంలో వెలిగిపోవడం, దేశ సంపదను బడాబాబులకు బదలాయించటం బిజెపి ప్రభుత్వ నీతి!


అలా అని వీళ్లెంత అరిచి గీపెట్టినా విజ్ఞానశాస్త్ర ప్రమాణాల ముందు అజ్ఞానం చెల్లుబాటు కాదు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పినంత మాత్రాన ఆవు మూత్రం గొప్ప ఔషధం అయిపోదు. ఆవు పాలలో బంగారం ముద్దలు రాలిపడవు. అలా అవ్వాలంటే- అది శాస్త్రబద్ధంగా నిరూపించబడాలి. ఏళ్ల తరబడి ఈ మహత్తు మీద మహా లెక్చర్లు దంచుతున్న మహానుభావులు ఇంతవరకూ ఒక్క నిరూపణ కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన కోట్ల ఖర్చుతో ఏర్పాటైన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ... ఈరోజు దాకా సాధించింది ఏమీ లేదు. నిజంగానే ఆవు పేడలో, మూత్రంలో, పాలలో అంతంత ఆరోగ్యం, బంగారం పెనవేసుకొని ఉంటే- ఎవరు మాత్రం వాటిని వదులుకుంటారు? అవెక్కడ దాక్కొని ఉన్నాయో, వాటిని వెలికితీసి వాడుకునే మార్గమేంటో కామధేను ఆయోగ్‌ శాస్త్రీయంగా ప్రజలకు చెప్పాలి. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు కౌ సైన్సు అంటూ అర్థం లేని పదబంధంతో ఆన్‌లైన్‌ పరీక్షలు పెడుతుంది. సైన్సు అనే మాటను ఉపయోగించటానికే యోగ్యత లేని ఆ సంస్థ- కేంద్ర ప్రభుత్వపు అండతో ఏకంగా యుజిసి ద్వారా విశ్వవిద్యాలయాలకు సిఫార్సు చేయించింది. వైజ్ఞానిక ప్రగతికి విఘాతం కలిగించే ఇలాంటి అశాస్త్రీయ పరీక్షలకు యుజిసి వంత పాడడం ఒక వింత.


పశువులకు ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాటితో నిరంతర సంబంధం ఉన్న ఈదేశ శ్రామిక జనులకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. పనికి, పాడికి మాత్రమే పశువులు ఉపయోగపడతాయని సగటు రైతుకు బాగా తెలిసిన సంగతి! కావలిస్తే ఆవులను పోషిస్తున్న, ఎద్దులను ఉపయోగిస్తున్న రైతుల దగ్గరకు ప్రభుత్వ పెద్దలు వెళ్లాలి. వాటి వాటి ఉపయోగాలు ఏమిటో సోదాహరణ పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు ఆ పరీక్షలేవో పాలక ప్రభువులే రాసుకోవొచ్చు. అంగారక గ్రహంపై ఆవాస యోగ్యత గురించి పరిశోధనలు జరుగుతున్న కాలంలో - ఈ ఆవు అజ్ఞానం ఏమిటోనని వైజ్ఞానిక ప్రపంచం విస్తుపోతోంది. నవ్విపోయిన గానీ నాకేటి వెరపు అన్న లెవెల్లో మోడీ జమానా మధ్యయుగాల్లోకి మొగ్గలేస్తోంది. విజ్ఞులైన పౌరులే ఈ మూఢావేశాలకు, మూర్ఖ వేషాలకు అడ్డుకట్ట వేయాలి.