Sep 26,2023 23:22

క్షేత్రస్థాయిలో వివరాల సేకరణను పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, పల్నాడు జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి - నకరికల్లు : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ టి.కృష్ణబాబు అన్నారు. మండల కేంద్రమైన నకరికల్లులో చేపట్టిన ఆరోగ్య సురక్ష సర్వేను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌తో కలిసి కృష్ణబాబు మంగళవారం పరిశీలించారు. ప్రతి జిల్లాలో పైలెట్‌ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 10032 హెల్త్‌ క్లినిక్‌లు, 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ ఎఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ వెళ్లి సర్వే చేస్తారని, ఆ సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ సమాచారాన్ని స్థానిక వైద్యులతో పాటు మరో ఇద్దరు నిపుణులూ పరిశీలిస్తారని, అవసరమైన వారికి పూర్తిస్థాయిలో చికిత్స నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తారని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి సంబంధిత వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కార్డుపైన చికిత్స నిర్వహిస్తామన్నారు. వారికి కావాల్సిన మందులు పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదో తెలుసుకుని, లేకుంటే గ్రామాల్లోని హెల్త్‌ సెంటర్లకు కొరియర్స్‌ ద్వారా మందులు అందజేస్తామన్నారు. రూ.67 కోట్ల మందులను కొనుగోలు చేసి హెల్త్‌ క్లినిక్‌లకు పంపినట్లు వివరించారు. అనంతరం వైద్యశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించి సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగారు. కార్యక్రమంలో ఎపిఎం ఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి బి.రవి, ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం నోడల్‌ ఆఫీసర్‌ హనుమకుమార్‌, డాక్టర్‌ గీతాంజలి, మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్‌ నాగపద్మజ, డిఆర్‌డిఎ పీడీ బాలునాయక్‌, తహశీల్దార్‌ నగేష్‌, ఎంపిడిఒ బి.శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు శ్రీను నాయక్‌, నాగమణి పాల్గొన్నారు.