ప్రజాశక్తి - చిలకలూరిపేట/యడ్లపాడు : అవసాన దశలో ఉన్న ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలని, భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరులను స్ఫూర్తిగా తీసుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు మండలం తమ్ములపాలెంలోని అమర్‌నగర్‌లో అమరవీరుల స్మారక సభ గురువారం నిర్వహించారు. వివిధ పోరాటాల్లో తమ ప్రాణాలను అర్పించిన 28 మంది స్తూపాల వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్), సిపిఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీల తదితర వామపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాల నాయకులు, శ్రేణులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను సిపిఎం సీనియర్ నాయకులు ఎన్.కాళిదాసు ఆవిష్కరించగా, అనంతరం నిర్వహించిన సభకు వేలూరు సర్పంచ్ బొంత తిరుతయ్య అధ్యక్షత వహించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఇబ్బంది పెట్టే అనేక చట్టాలను ఇష్టానుసారం తెస్తున్నారని, ఇందుకు దేశభక్తి ముసుగు తొడుగుతున్నారని అన్నారు. అటువంటి ప్రభుత్వానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి కుంటిసాకులతో అంటకాగుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఎక్కుపెట్టబ డుతున్న సిపిఐ, ఇడి సంస్థలు అదానీ వ్యవహారంలో నిద్రపోతున్నాయని దుయ్యబ ట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం విస్మరించిందని, పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు పూనుకుందని అన్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారాలను మోపుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, వ్యవసాయాన్నీ కార్పొరేట్ల పరం చేయడానికి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రజలకు ప్రత్యామ్నాయ పాలనను అందిస్తోందని అన్నారు. వరికి కేంద్రం రూ.1950 మద్దతు ధర ప్రకటించగా కేరళ మరో రూ.800 కలిపి రూ.2750 ఇస్తోందని తెలిపారు.
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతివరప్రసాద్ మాట్లాడుతూ మరణిస్తా మని తెలిసీ పోరాట బాటలో నడిచిన త్యాగధనులను నేటితరం ఆదర్శంగా తీసుకోవా లన్నారు. వామపక్షాలను ఎంతగా అణగదొక్కు తున్నా దాన్ని తట్టుకుని నిలబడుతున్నాయని, బెంగాల్, పంజాబ్, బీహార్, త్రిపుర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పోరాటపటి స్ఫూర్తిదాయకమని చెప్పారు. పెట్రేగిపోతున్న మతోన్మాదంపై నిర్విరామ పోరాటాలు చేయాలని అన్నారు.
సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌బాబు మాట్లాడుతూ నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల జమ చేస్తానన్న మోడీ ఇప్పుడు ఒక్కొక్కరి తలపై రూ.1.9 లక్షల అప్పును మోపారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో టిడిపి పాలనలో చంద్రబాబు రూ.50 వేల కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.1.60 కోట్లకు పెంచారని తెలిపారు. కర్ణాటకలో నందిని పాలకు బదులు అమూల్ పాలను విక్రయించాలంటూ కేంద్రం చేస్తున్న ఒత్తిడి దేశంలో బహుళత్వానికి విఘాతమన్నారు.
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి మాట్లాడుతూ దేశాన్ని దశల వారీగా అదాని, అంబానీలకు మోడీ, అమిత్‌షా అమ్మేస్తున్నారని విమర్శించారు. చివరకు అటవీ సంరక్షణ చట్టాన్ని మార్చేసి ఆదిమవాసుల భూముల్ని సైతం అంబాని, అదానికి రాసివ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపక్షాన నిలవాల్సిన న్యాయస్థానాలు, మీడియా తమ విశ్వసనీతయను కోల్పోతున్నాయని, వాకపల్లి గిరిజన మహిళల విషయంలో కోర్టు తీర్పు ఇందుకు నిదర్శనమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నికరంగా పోరాడే వామపక్షాలు ఐక్యమై ఉద్యమించాలని అన్నారు. కార్యక్రమాన్ని అమరవీరు స్మారక ట్రస్ట్ కన్వీనర్ చెరుకూరి సత్యనారాయణ పర్యవేక్షించగా న్యాయవాదులు ఆర్.వెంకటేశ్వరరావు, ఎం.ఉపేంద్ర, నల్లమడ రైతుసంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, వామపక్ష పార్టీల నాయకులు పోపూరి సుబ్బారావు, తోకల కోటేశ్వరరావు, కె.రోశయ్య, పేరుబోయిన వెంకటేశ్వర్లు, గోగడ హరిబాబు, సాతులూరి బాబు, హనుమంతరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నాగభైరు సుబ్బాయమ్మ, పేలూరి రామారావు, విజయనిర్మల పాల్గొన్నారు.










