
రంగనాథం ఊరొచ్చి మూడు రోజులయ్యింది. కౌలుకు భూమి ఇవ్వాలంటూ ముఖం చూపించినవాడు లేడు. అతనికి చికాగ్గా ఉంది. ఎప్పుడూ ఉగాది ముందే మాట్లాడుకునేవారు. అన్నీ కుదిరితే ఉగాది రోజు ముహూర్తానికి ఎరువు వేసేవారు. ఓ సారి దుక్కిదున్నే వారు. ఆ ఏటికి భూమి స్వాధీనం చేసుకునేవారు. ఈ ఏడాది కౌలు రైతులు కుదిరేట్టు లేదనుకున్నాడు. రంగనాథంలో టెన్షన్ మొదలయ్యింది.
ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. రెండేళ్ల నుంచి మరీ ఘోరంగా ఉంది. గత ఏడాది నానాపాట్లు పడ్డాడు. ఆ సూరిగాడిని, సన్యాసిని బతిమిలాడి చెరో ఐదెకరాలు అప్పగించాడు.
''పెట్టుబడి అంతా మీదే బాధ్యత. చెల్లింపులు కల్లం గట్టున చూసుకుందాం, అలాగైతేనే భూమి చేస్తాం'' అని కండిషన్ పెట్టారు. తప్పని పరిస్థితుల్లో అన్నింటికీ ఒప్పుకున్నాడు. తీరా కల్లం గట్టున డబ్బులకు పట్టుబట్టానని ఈ ఏడాది చెయ్యలేమన్నారు. ''భూమి ఎవులికైనా ఇచ్చుకో'' అంటూ టెంపర్‌గా చెప్పి వెళ్లిపోయారు.
''పొలం యజమానులంటే మరీ తేలిక భావమైపోయింది. ఒకప్పుడు కౌలుకు భూమి ఇవ్వాలంటూ నెలల తరబడి ఇంటి చుట్టూ తిరిగేవారు. వినయ విధేయతలు ప్రదర్శించేవారు. చిన్నచిన్న తాయిలాలిచ్చేవారు. చుట్ట బంధువులతో చెప్పించుకునేవారు. ఇప్పుడంతా రివర్స్, భూమి ఇవ్వండని అడిగినోడే లేడు. అంతా కాలమహిమ. ఏం చేస్తాం. నా అసహాయత చూసి వీరికి మరీ కొమ్ములొస్తున్నాయి'' తనలో తానే తిట్టుకున్నాడు రంగనాథం.
రంగనాథం ఎల్‌ఐసీ అధికారి. ఊరికి మూడు వందల కిలోమీటర్ల దూరంలోని పట్నంలో ఉద్యోగం. రిటైరయ్యాక చూసుకుందామని ప్రస్తుతానికి అక్కడే ఇల్లు కొనుక్కుని స్థిరపడిపోయాడు.
తండ్రి కాలంచేశాక ఓ పదెకరాల మాగాణి, ఓ ఐదెకరాల మెట్ట అతని వాటాగా వచ్చాయి. సొంతంగా వ్యవసాయం చేయలేడు. కౌలుకు ఇవ్వడానికి ఇన్ని పాట్లు.
ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొంత తమ్ముడు ఊర్లో ఉన్నాడు. కానీ వాడూ కన్నెత్తి చూడడం లేదు.
''తియ్యటి మాటలే తప్ప, పోనీలే మా అన్నభూమే కదా, నా భూమితోపాటు కలిపి చేస్తే పోదా'' అన్న మాటలేదని బాధపడుతున్నాడు.
సొంత తమ్ముడు ''ఊ'' అనడు. బయటివాళ్లు ముందుకు రావడం లేదు. రంగనాథానికి ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఈ బాధపడలేక మెట్ట పొలంలో ఐదేళ్ల క్రితమే మామిడి, జీడి మొక్కలు నాటించేశాడు. చుట్టూ ఇనుపకంచె వేసి, నెలజీతానికి ఓ మనిషినీ పెట్టేశాడు. ఏడాది నుంచి దిగుబడి కూడా వస్తోంది.
వచ్చింది అంతంతమాత్రం ఆదాయమే, అయినా పువ్వు రాగానే అమ్మకానికి పెట్టేస్తున్నాడు. అడ్వాన్స్ తీసుకుంటున్నాడు. పల్లం పదెకరాలతోనే పాట్లన్నీ.
తొలిరోజుల్లో తమ్ముడికే భూమి అప్పగించాడు. అన్నదమ్ములు సయోధ్యగానే ఉన్నా, ఆడోళ్ల మధ్య కుదరలేదు. పెళ్లాం పట్టుదలకు పోవడంతో తమ్ముడు నావల్ల కాదనేశాడు. అప్పటి నుంచి భూమి బయటివాళ్లకు ఇచ్చుకోక తప్పడం లేదు. గడచిన పదేళ్లుగా బయటివాళ్లే భూమి సాగుచేస్తున్నారు.
తమ్ముడు భూమి వదిలేశాక ఏం చేయాలా అని రంగనాథం కంగారుపడ్డాడు. అనుకోని అదృష్టంలా భూమి కోసం రైతులు పోటీపడడంతో ఆశ్చర్యపోయాడు. విషయం తెలిసిన మరునాటి నుంచి భూమికోసం రైతులు ఇంటిముందు క్యూకట్టారు. తమకంటే తమకు ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో రంగనాథంలో అహంకారం మొదలయ్యింది.
''తనవి చెరువుకింద భూములు. అందుకే అంత డిమాండ్'' అనుకున్నాడు. భూమంతా ఒక్కడికే ఇచ్చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది రావచ్చని అనుమానించాడు. ఇద్దరు ముగ్గురు రైతులకు సర్దుతూ వచ్చాడు. ఇస్తామన్నంత నమ్మకంగా ఇచ్చేవారిని, గౌరవంగా వ్యవహరించే వారిని కొనసాగించేవాడు. వ్యవహారం సెటిలయ్యే వరకూ ఒకలా, తర్వాత ఒకలా వ్యవహరించేవారికి ఏడాదికే రాం రాం చెప్పేసేవాడు.
లేనిపోని కండీషన్లు పెట్టేవాడు. కౌలు నిబంధనలూ పాటించేవాడు కాదు. న్యాయంగా అయితే సగం కౌలు తీసుకోవాలి. విత్తనాల నుంచి ఎరువుల వరకూ అయ్యే పెట్టుబడులు సగం భరించాలి. అత్యవసర ఖర్చులైనా సగం వాటా ఇవ్వాలి. కానీ అన్నింటికీ బెట్టే.
అరవైశాతం కౌలు ఇస్తానంటేనే భూమి ఇస్తాననేవాడు. పెట్టుబడుల్లో ముప్ఫైఐదు, నలభై శాతమే భరిస్తానంటూ బేరాలు పెట్టేవాడు. నష్టమని తెలిసినా కౌలు రైతులు అన్నింటికీ ఒప్పుకునేవారు. మంచి మాగాణి కావడంతో కష్టపడితే నాలుగు గింజలు కళ్లజూడొచ్చన్నది వారి ఆశ..
సంక్రాంతి నుంచే భూమి కోసం రంగనాథం చుట్టూ తిరిగేవారు. ఏకంగా అతను పనిచేస్తున్న పట్నానికి వెళ్లిపోయేవారు. పనిమీద రంగనాథం ఊర్లోకి వస్తే ఇంటికి క్యూ కట్టేవారు. అవీ ఇవీ ఇచ్చి మంచి చేసుకునేవారు. రంగనాథం వింటాడన్న భావన ఉన్నవాళ్లతో చెప్పించుకునేవారు. రంగనాథం పెట్టిన కండీషన్లంటికీ ఒప్పుకునేవారు. ఈ పరిస్థితి రంగనాథంలో మరింత అహంకారానికి కారణమయ్యింది.
పంట కోతకు వచ్చాక ''తానున్నప్పుడే కోతకోయాలి, మోత మోయాలి. నూర్పు తీయాలి, కొలత వేయాలి'' అంటూ కండీషన్లు పెట్టేవాడు. రంగనాథం ఆశ రోజు రోజుకీ పెరిగిపోతున్నా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుండడంతో కౌలురైతులు భూమి వదులుకునేందుకు ఇష్టపడేవారు కాదు.
ఐదేళ్లపాటు రంగనాథం ఆడిందే ఆటగా వ్యవహారం సాగింది. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయి.
పెట్టుబడులు పెరిగాయి. దిగుబడి తగ్గిపోయింది. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఏ నష్టం జరిగినా రంగనాథం తనకు సంబంధం లేదనేవాడు. పెడసరంగా మాట్లాడేవాడు. చేతకానప్పుడు భూమి కౌలుకు ఎందుకు తీసుకున్నావంటూ మాటజారేవాడు. అటువంటి వాతావరణంలో రంగనాథం భూమి అతికష్టమ్మీద రెండేళ్లు నలుగురు రైతులు సాగుచేశారు. ఆ తర్వాత వారు కూడా మావల్ల కాదనేశారు.
కొత్తవారు ముఖం చూపించడానికే ఆలోచించేవారు. వలసల ప్రభావం పెరగడంతో రంగనాథం కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
ఊర్లో శ్రమపడితే వచ్చే ఆదాయం కంటే గోదావరి జిల్లాలకు వలసపోతే ఎక్కువ గిట్టుబాటు అవ్వడం కూలీలను ఆకర్షించేది. కుటుంబాలతో సహా వెళ్లిపోయే వారి సంఖ్య పెరిగింది. ఊర్లో వ్యవసాయ కూలీలు దొరకడం తగ్గిపోయింది. ఉన్నవారు సమయాన్ని బట్టి అధిక మొత్తం డిమాండ్ చేసేవారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపయ్యింది. కౌలుకు భూమి తీసుకున్న సన్నకారు రైతులు కూడా వలసలనే నమ్ముకోవడంతో రంగనాథానికి మరిన్ని కష్టాలు తప్పలేదు.
''ఆరుగాలం శ్రమపడినా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేని పరిస్థితి. దానికంటే, పట్నం వెళ్లిపోతే ఏదో ఒక పనిచేసుకుని ప్రశాంతంగా బతకొచ్చు'' అనుకునే వారి సంఖ్య పెరిగింది. వలస వెళ్లిన వారు చుట్టం చూపుగానే తప్ప శాశ్వతంగా తిరిగి వచ్చిన దాఖలా లేదు. చిరు వ్యాపారులుగా, కట్టుపనివారిగా, తాపీ మేస్త్రీలుగా ఏదో ఒక ప్రత్యామ్నాయ వృత్తుల్లో స్థిరపడిపోయారు. గ్రామాలు ఖాళీ అయ్యాయి. రంగనాథం వంటి భూయజమానులకు కష్టాలు పెరిగాయి. అంతో ఇంతో భూమి ఉన్నవారు, వృత్తిపనివారు, ఉద్యోగులు మాత్రమే గ్రామాల్లో మిగిలారు.
గ్రామాల్లో కౌలుకు పోటీపడే రైతుల స్థానంలో భూమి కౌలుకు తీసుకోవాలని అర్జీ పెట్టుకునే యజమానుల సంఖ్య పెరిగింది. కౌలుకు భూమి తీసుకునేవారు కండీషన్లు పెట్టడం మొదలుపెట్టారు. పెట్టుబడులు భరించాలని, నలభై శాతం కౌలు మాత్రమే ఇస్తామని, ప్రకృతి విపత్తులతో పంటపోతే పెట్టుబడుల నష్టం కూడా చెరిసగం భరించాలని, ఆ ఏడాది పంటలో మూడో వంతు వాటా మాత్రమే ఇస్తామని చెప్పడం మొదలుపెట్టారు.
పంటభూమిని బీడుగా వదిలేయడం ఇష్టంలేక, ఆ కండీషన్లకు ఒప్పుకుంటూ వస్తున్నాడు రంగనాథం. ఎంతలా సర్దుకుపోతున్నా కౌలు రైతుల కండీషన్లు అతనికి చికాకు తెప్పించేవి. పరిస్థితులు బాగున్నప్పుడు తానూ అటువంటి కండీషన్లే పెట్టేవాడినన్న సంగతి రంగనాథం మర్చిపోయాడు.
ఒకప్పుడు కల్లంగట్టున అన్నీ లెక్కలు వేస్తే మూడొంతుల పంటలో రెండొంతులు తన ఇంటికి చేరితే, ఒక వంతే కౌలు రైతుకు మిగిలేది. ఇప్పుడు పరిస్థితి ఉల్టా అయ్యింది. చేతికి ఎంత వస్తుందో అర్థంకాని పరిస్థితి. అప్పుడు రైతులు ఎంత బాధపడేవారో రంగనాథానికి అర్థమవుతూ వచ్చింది. అన్నింటికీ సర్దుకుపోతున్నా భూమి ఇవ్వండని అడిగేవాడు లేకపోవడం మరీ చికాకుగా ఉంది.
మరో రెండు రోజులు గడిచినా కౌలు రైతులు ఎవరూ ముఖం చూపించలేదు. చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల్లో పరిచయస్థులకు విషయం చెప్పి ఎవరైనా ఉంటే పంపాలని కోరాడు. అదీ ఫలితం ఇవ్వలేదు. గతంలో భూమి చేసిన ఇద్దరు ముగ్గురు రైతులు ఊర్లోనే ఉండి వ్యవసాయం చేస్తున్నారని తెలిసి నేరుగా వెళ్లి కలిశాడు. భూమి చెయ్యలేమన్నారు. ఆ సందర్భంగా పెడసరంగా కూడా మాట్లాడారు.
''ఏం ఇప్పుడు మా అవసరం తెలిసొచ్చిందా? అంతా బాగున్నప్పుడు భూమిమీద నిలబడి మాట్లాడేవాడివి. రాలిపడిపోయేవాడివి? పెపంచంలో నీ ఒక్కడి దగ్గరే భూమి ఉన్నట్టు గోరోజనం చూపేటోడివి. రోజులెప్పుడూ ఒక్కలా ఉండవు రంగనాథం గోరో. శ్రమ విలువ తెలియని నీలాంటివాడి భూమి కౌలుకు చేయడం కంటే కూలికిపోతే గౌరవంగా బతకొచ్చు. నీ భూమికీ, నీకూ ఓ దండం బాబూ. మమ్మల్ని ఇబ్బంది పెట్టకు ఒగ్గేరు'' అంటూ ముగ్గురూ కూడబలుక్కున్నట్టు ఒకేలా మాట్లాడడంతో మనస్తాపానికి గురయ్యాడు.
ఆవేదనగా ఇంటికి చేరుకున్న రంగనాథానికి గడపలో కూర్చున్న ఎత్తరుగు సుగ్రీవులు కనిపించగానే ఊపిరి వచ్చినట్టయింది.
మొత్తమ్మీద ఉగాదికి రెండు రోజులు ముందు ఏకంగా ఊరిలోని కౌలు రైతే దొరికాడని ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. కానీ అది బయటకు కనిపిస్తే లోకువైపోతానని జాగ్రత్త పడ్డాడు.
''ఏట్రా సుగ్రీవులు, వచ్చివారమైతే ఇప్పుడు కనిపించావు, ఒకేల భూమి కోసమా ఏటి'' అంటూ పలకరించాడు.
అప్పటికే భూమి ఎవరికో ఇచ్చేసినట్లు బిల్డప్ ఇస్తే ఆడిదగ్గర ఎక్కువ కౌలుకు ఒప్పందం కుదుర్చుకోవచ్చన్నది రంగనాథం ప్లాన్.
''చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు అందుకేనండి. ఏదో మీ భూమి కోసం నాలుగూరోళ్లు బారులు తీరిపోయినట్టు, ఇంకా బెట్టు చేస్తన్నారు. ఇప్పటి వరకూ ఎవుడూ ముకం చూపించలేదని అందరికీ తెలుసులెండి. అయినా ఇప్పుడెవుడూ కౌలుకు భూమి సెయ్యిడం నేదండి. ఎందుకంటే కట్టం రైతుది. లాభం మీది. ఎందుకండీ పుర్రాకులు. అందుకే మీకెవుడూ దొరకడం నేదండి'' అన్నాడు నింపాదిగా.
భూమి కోసం ప్రాధేయపడడానికి వచ్చాడని ఊహించిన రంగనాథం, సుగ్రీవులు చెప్పిన మాటతో జావగారిపోయాడు.
''ఏమిరా... ఊర్లో ఉన్నోడివి. వ్యవసాయం చేసుకుంటే నాలుగు గింజలు కళ్లజూడొచ్చు కదరా. ఒల్లొంగకపోతే ఎలా బతుకుతార్రా అన్నాడు?!
''భూమి చేసే ఓపికనేక కాదండి. గిట్టుబాటు కాదనండి. నేను పొలం పనులు వదిలీసి ఐదేళ్లు దాటిపోనాది రంగనాథంగోరో. ఆ ఉద్దేశమే ఉంటే మీరొచ్చిన రోజే వచ్చుందును కదండీ. అయినా ఎందుకొచ్చిన పుర్రాకులండి. యవసాయం చేస,ి ఇప్పుడెవుడు బాగుపడుతున్నాడండీ. దానికంటే కూలికి ఎలిపోడం మేలు కదండీ. మా చంటిది మీ పట్నంలోనే ఉంది కదా! దాని దగ్గరికి వెళ్లి వచ్చాను. తమరు వచ్చారని తెలిసి ఓపాలి పలకరించిపోదామని ఇటు వచ్చాను, అంతకంటే ఇసయమేటీ నేదండి'' అంటూ నింపాదిగా చెప్పడంతో రంగనాథం ఉసూరుమన్నాడు.
''ఇంతకీ ఎవలికిచ్చారు భూమి'' అని సుగ్రీవులు ప్రశ్నించడంతో రంగనాథానికి ఏం చెప్పాలో అర్థకాలేదు.
అయినా నిజం చెప్పడం ఇష్టం లేక ''ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు, ఇంకా వ్యవహారం తేలలేదు, సెటిల్ చెయ్యాలి'' అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేశాడు.
''మీరు సెప్పింది నేను నమ్మడం లేదుగాని, మీరేమనుకోనంటే ఓమాట సెపుతానండి. ఎవుడైనా భూమి చేస్తానని వస్తే బెట్టు సెయ్యకుండా ఇచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడెవులూ భూమి కౌలుకు తీసుకోవడం నేదండి. అందువల్ల ఇంటిచుట్టూ తిరుగుతున్నోడిని వదలుకోకండి. ఆ తర్వాత మీరు తిరిగినా ప్రయోజనముండదు. ఉగాది రెండు రోజులే ఉంది. మీ మంచికే చెబుతున్నాను'' అంటూ లేచి వెళ్లిపోయాడు సుగ్రీవులు.
రంగనాథానికి తలకొట్టేసినట్టుంది. ఈడు కూడా సలహా ఇస్తున్నాడనుకున్నాడు. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఒకప్పుడు తన తీరే ఇప్పుడు ఎవరూ తన భూమి కౌలుకు తీసుకునేందుకు ముందుకు రాకపోడానికి కారణమకున్నాడు.
'మా రెక్కల కట్టాన్నంతా మీ ఇంటిలో పెట్టుకుంటే మేమెలాగ బతకలండీ రంగనాథం గోరో'' అంటూ రైతులు ఉసూరు మంటే ఆ రోజుల్లో వినోదం చూసేవాడు.
''ఊరికే భూమి ఎవుడిస్తాడురా?'' అని పెడసరంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ కష్టమేదో నాకే తెలిసొస్తోంది' అనుకున్నాడు.
ఏదోలా బతిమిలాడి తమ్ముడికే ఈ ఏడాది భూమి అప్పగిస్తే, ఆ తర్వాత ఏదో నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నాడు. భోజనం చేశాక తమ్ముడు ఇంటివైపు బయలుదేరాడు.
గడపలోకి అడుగు పెడుతుండగానే మరదలు మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు.
''ఇదిగో, ఇప్పుడే చెబుతున్నా మీ అన్న భూమి చేస్తానని ఒప్పుకున్నావో నీకూ నాకూ జట్టీ అయిపోద్ది. మీ అన్న ఊర్లోకి వచ్చి వారమయ్యింది. ఎవులూ తొంగిచూసి, వంగివాలడం లేదు. నాలుగు ఊర్లు తిరిగొచ్చినా భూమి తీసుకున్నోడు లేడు. ఆ సుగ్రీవులుగాడిని అడిగితే నాకు వద్దనేశాడట. ఇక మిగిలింది నువ్వే. మా అన్న భూమి.. నేల తల్లిని బీడుగా వదిలేస్తామా.. అంటూ సెంటిమెంట్ మాటలకి బాధ్యత తీసుకున్నావో ఇంటిల యుద్ధమైపోద్ది. నీ ఇష్టం. నా మాట మీరావంటే మర్యాద దక్కదు..'' అంటూ సీతాలు మొగుడిని హెచ్చరించింది.
''ఎందుకలా గింజుకుంటావే. ఇప్పుడెవుడొచ్చి నీకు భూమి ఇత్తామని బతిమిలాడుతున్నాడు. మా అన్న ఎవుడికో ఇచ్చుకుంటాడులే. నా భూమే నేను సెయ్యిలేకపోతన్నాను. ఇన్నాళ్లలాగా మేస్టర్ ఉద్యోగం ఉందా ఇప్పుడు. సెలవు చీటీ రాసి గోడకు అంటించేసి, పొలం నుంచి రాగానే చింపేయడానికి, ఎప్పుడు ఎవుడొస్తాడో తెలీదు. ఊర్ల ఎవుడు వీడియో తీసి అధికారులకు పంపిస్తాడో తెలీదు. అటు ఉద్యోగం, ఇటు ఎవసాయం చేయలేక నేనే నానా పుర్రాకులు పడుతుంటే, ఇంకా మా అన్న భూమి తీసుకోవడం నా వల్ల అవుద్దా? ఎందుకలా లేనిపోనివి ఊహించుకుని నులుసుకుంటన్నావు'' రంగనాథం తమ్ముడు ఆనందరావు చిరాకుపడ్డాడు.
''నాది నులుసుకోవడం కాదు, ఆ మహాతల్లి మాటలు గుర్తొచ్చి అంటన్నాను. నా మొగుడు కట్టం నేను తిన్నా. ఆ మహాతల్లి దాని మొగుడు సొమ్మేదో ఇంటిలో పోసుకుంటున్నట్టు ఫోజుకొడతాది. ఆళ్ల భూమి సెయ్యిడమెందుకు, ఆళ్ల మాటలు పడడం ఎందుకు. పట్నంలో ఉన్నదాయే, కాబట్టి కాస్త నాజూగ్గా కనిపిస్తాది. దానికే ఏదో మహారాణిలాగా ఫోజు కొడతాది. దానికంటే ఎవులిక్కడ తక్కువోల్లు లేరు. దాని మాటలు నేను పడలేను. దాని మొగుడు గవర్నమెంటు ఉజ్జోగస్తుడైతే, నా మొగుడూ గవర్నమెంటు ఉజ్జోగస్తుడే. దానికి నేనేమీ తీసిపోను. దాని సొమ్మేటీ నాకక్కర్లేదు. ఆ భూమి చేస్తానని ఒప్పుకున్నావంటే నేను సచ్చినంత ఒట్టే'' సీతాలు గట్టిగా చెప్పింది.
గడపలో నిల్చుని తమ్ముడూ, మరదల మాటలు విన్న తర్వాత రంగనాథానికి విషయం బోధపడింది. వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక అవకాశం ఉందనుకున్న ఒకటి, రెండు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేదని ఊర్లోని సుబ్బారావుకు కబురుపెట్టాడు. వాడు ధీమాగా రావడం చూసి రంగనాథానికి ఒళ్లు మండిపోయింది. కానీ తమాయించుకున్నాడు.
''ఏమిరా ముఖం చూపించడం మానేశావు. పోనీలే ఖాళీగా ఉన్నావు, నా భూమిస్తే బతుకుతావని నేను అనుకుంటుంటే నువ్వేంటిరా ఏమీ పట్టనట్టు తిరుగుతున్నావు'' రంగనాథం పాచిక విసిరాడు.
పదెకరాల భూమి కౌలుకు దొరుకుతుందంటే ఉబ్బి తబ్బిబ్బయిపోతాడనుకున్నాడు. సుబ్బిగాడిలో ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఉసూరుమన్నాడు.
''కబురెట్టారంటే రేపు ఊరికి బయలుదేరినప్పుడు బండికట్టాలేమో, సామానేమైనా తీసుకెళ్తన్నారేమో అనుకుని వచ్చానండి. కౌలుకు భూమి నాకెందుకండి? ఇప్పుడు నాకంత ఓపిక నేదండి. నా కొడుకులు పట్నంలో పనిచేసుకుని బతుకుతున్నారు. ఊరిల నేను, మా ఇంటిది కూలీనాలీ చేసుకుంటూ బతుకుతున్నాం. నచ్చినప్పుడు పనికెల్తన్నాం, ఒంటిల కట్టంగా ఉంటే మానేస్తన్నాం.. అప్పుడప్పుడూ అవసరమైన వాళ్లకు బండికడితే అంతోఇంతో వత్తంది. చాలులెండి. రెక్కలాడినన్నాలూ కట్టపడతాం, ఆ తర్వాత కొడుకుల దగ్గరకు ఎల్లిపోతాం. ఇప్పటికే అక్కడెందుకని ఇద్దరు కొడుకులూ సతాయిస్తన్నారు. పట్నం వాతావరణంలో ఇమడలేమని తప్పించుకుంటన్నాం. భూమి సేసే ఉద్దేశం నాకు నేదండి రంగనాథంగారో'' అంటూ లేచి వెళ్లిపోయాడు.
రంగనాథానికి తలకొట్టేసినట్టయింది. పదెకరాల పల్లం భూమి సాగుకి ఇవ్వడానికి ఇంతమందిని బతిమిలాడాల్సి రావడం అవమానంగా అనిపించింది. చివరికి తమ్ముడు కూడా ససేమిరా అనడం, ఇప్పుడు సుబ్బిగాడు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో రంగనాథంలో పౌరుషం పుట్టుకొచ్చింది.
''అడినీ, ఈడినీ బతిమిలాడ్డం ఎందుకు, మనకీ వ్యవసాయం వచ్చుకదా. ఉద్యోగం రాకముందు సెయ్యిలేదా? ఇన్నాళ్లకు మళ్లీ అవసరం పడిందనుకుంటే సరి. మనవద్ద పెట్టుబడికి ఢోకాలేదు. ఊర్లో సొంత ఇల్లుంది. ఇప్పుడన్నింటికీ మిషన్లు వచ్చేశాయి. ఖరీఫ్‌లో దమ్ము, ఊడుపు టైంలో ఓ వారం ఊర్లో ఉంటే పనులన్నీ పూర్తయిపోతాయి. ఆ తర్వాత కోత, మోతకు మరోవారం, నూర్పు తీసినప్పుడు ఇంకోవారం సెలవు పెడితే అయిపోతుంది. నాలుగు నెలల వ్యవధిలో ఆ మాత్రం సెలవు దొరక్కుండాపోదు. మధ్యమధ్యలో ఎలాగూ శని, ఆదివారాల సెలవులు ఉంటాయి. అవసరం ఉంటే వచ్చి పంట చూసి వెళ్లిపోవచ్చు. నేనేంటో ఊరివాళ్లకే కాదు చుట్టుపక్కల వాళ్లకూ తెలియాలంటే ఇదే మంచి ఆలోచన'' అనుకున్నాడు రంగనాథం.
మరెవరికీ భూమి కౌలుకు ఇవ్వకూడదని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు బయలుదేరాల్సి ఉన్నా ఆ రోజు సాయంత్రమే బయలుదేరి ఇంటికి వచ్చేశాడు.
తొలకరి వానలు కురవగానే రెండు రోజులు ఊర్లో ఉండి, తమ్ముడి సాయంతో ఆకుమడులు తయారుచేసి విత్తనాలు చల్లించేశాడు. కాస్త చూసుకోమని తమ్ముడికి చెప్పి వచ్చేశాడు. దమ్ము సమయానికి అధునాతన ట్రాక్టర్లు ఊర్లోకి దించాడు. మూడు రోజుల్లో పదెకరాల దమ్ము పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో యంత్రాలతో నాట్లు పూర్తయ్యాయి. అది చూసి ''రంగనాథం పనిమంతుడే'' అని ఊరివాళ్లే ముక్కున వేలేసుకున్నారు.
తమ్ముడి సాయం ఎలాగూ ఉంటుందని నమ్మకంతో పంటను చూసుకోవడం, ఎరువులు చల్లడం, నీరు కట్టడం వంటి వాటికోసం సుబ్బిగాడినే నెల జీతానికి పనికి పెట్టుకున్నాడు. కోత సమయంలోనూ యంత్రాలు వాడాడు. ట్రాక్టర్లతో కల్లానికి పంట తరలించి, కుప్పలుగా పెట్టించేశాడు. సంక్రాంతికి పదిహేను రోజుల ముందు నూర్పు తీయించాడు. ట్రాక్టర్లతో తొక్కించాడు. మూడు రోజుల్లో ఆ పని పూర్తయింది.
కల్లంలో ధాన్యపురాశులు చూడగానే రంగనాథం కళ్లు జిగేల్‌మన్నాయి. మొత్తం పంటంతా ఇప్పుడు తన సొంతం అన్న గర్వం తొంగిచూసింది. కల్లం గట్టునే పంటను మిల్లు ఓనరుకు అమ్మేశాడు. కొంత డబ్బిచ్చి, మిగిలింది నాలుగు రోజుల్లో అకౌంట్‌కు జమ చేస్తానని చెప్పగానే పట్నానికి వచ్చేశాడు.
రెండు రోజుల తర్వాత వచ్చిన సెలవు రోజు తీరుబాటుగా కూర్చుని లెక్కలు వేసుకున్నాడు. డైరీ తెరిచి ఖరీఫ్‌కి అయిన పెట్టుబడి లెక్కేశాడు. తాను ఊరుకి వెళ్లి రావడానికి అయిన ఖర్చులు కలిపాడు. మిల్లుకు తోలిన ధాన్యం బస్తాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించాడు. బ్యాలెన్స్ షీట్లో అంకెలు వెక్కిరించాయి. లాభనష్టాలు బేరీజు వేసిన రంగనాథానికి గూబగుయ్యిమంది.
జమా ఖర్చుల్లో తేడా చూడగానే కౌలు రైతులే గుర్తుకొచ్చారు. మా రెక్కల కష్టమంతా మీ ఇంటికే చేరిపోతోందని అప్పట్లో వారెందుకు అన్నారో ఇప్పుడు అర్థమయ్యింది రంగనాథానికి. తాను చేసిన శ్రమదోపిడీ గుర్తుకొచ్చింది.
- బివి రమణమూర్తి
bvbvrmurty@gmail.com