ప్రజాశక్తి- తగరపువలస : ప్రస్తుతం చదువుకునేందుకు ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు. స్థానిక అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో అవంతి విద్యా సంస్థల్లో 2021-22 ఏడాదిలో వివిధ కోర్సులు పూర్తి చేసి పట్టభద్రులైన సుమారు 1200 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన సుమారు 60 మంది విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను బుధవారం జరిగిన స్నాతకోత్సవ సభలో వెంకయ్య నాయుడు, రాజ్య సభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారతీయ సంస్కతి సంప్రదాయాలతో జోడించి విద్యను అభ్యసించాలని సూచించారు. నిజాయతీ, నిబద్దతతో ఉంటే రంగం ఏదైనా రాణించవచ్చని తెలిపారు.
కులం, ధనం కంటే గుణం గొప్పది
కులం, ధనం కంటే గుణం గొప్పదని వెంకయ్యనాయుడు అన్నారు. గూగుల్ కంటే గురువు గొప్ప అని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికామనేది ప్రాధాన్యం కాదని, ఉన్నంత కాలం సమాజానికి ఏ మేరకు మేలు చేసామనేది ముఖ్యమని అన్నారు. గతంలో రాజకీయాల్లో వ్యక్తిత్వం, నిబద్దత, నిజాయతీ ఉండేవని, నేడు కులం, ధనం, నేర చరిత్ర అర్హతలు గా ఉండడం దురదృష్టమని వాపోయారు.
మాతభాషను మరువద్దు
మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువద్దని విద్యార్థులకు నొక్కి చెప్పారు. తెలుగు భాష, తెలుగు జాతి ఔ న్నత్యాన్ని ఇనుమడింప జేయాలన్నారు. చేపలను పట్టే విధానం నేర్పాలి తప్పితే, వాటిని పట్టి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని పేర్కొంటూనే పరోక్షంగా రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై వ్యంగ్యో క్తులు విసిరారు. ఉచిత పథకాలు ఇవ్వ కూడదని చెప్పట్లేదు, అదే సందర్భంలో నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత ఉపాధి కల్పిస్తే ఉపయోగమన్నారు. గతంలో గనులు దోచుకున్న వారుంటే, నేడు జీవ నదులు సైతం ఆక్రమణకు గురవుతున్న ట్లు వాపోయారు.
ఐదు వేల ఏళ్లు ఉన్న మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని గౌరవ అతిథిగా హాజరైన రాజ్య సభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉండాలని అవంతి విద్యా సంస్థల అధినేత, స్థానిక ఎమ్మెల్యే ము త్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జెఎన్‌టియు, ఉపకులపతి ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాద రాజు, అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎం.ప్రియాంక, జాయింట్ సెక్రటరీ ఎంఎస్ నందీష్, అవంతి విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.










