ప్రజాశక్తి - బాపట్ల రూరల్
పరిశోధన రంగంలో రాణించాలంటే అవిశ్రాంత పరిశ్రమ ఉండాలనీ ఇస్రో శాస్త్రవేత్త సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతి సందర్భంగా 56వ ఇంజనీర్స్ డే సంబరాలు శుక్రవారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగాయి. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశోధన రంగంలో రాణించాలంటే ఆత్మ విశ్వాసం, అవిశ్రాంత పరిశ్రమ ఉండాలని అన్నారు. నేటి యువతరం పరిశోధనా రంగంవైపు పయనించి దేశం గర్వపడేలా సమాజ అభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని అన్నారు. కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1988-1992బ్యాచ్‌లో తాను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నానని తెలిపారు. హెక్సవేర్ టెక్నాలజీస్ హెడ్ హెచ్ అర్ సౌగతా సెను మాట్లాడుతూ నేటి సాంకేతిక విద్యార్థులు భావ వ్యక్తీకరణ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. ఆధునిక కంప్యూటర్ విజ్ఞానంపై మంచి పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్పలనేని శ్రీనివాసరావు సభకు అధ్యతక్ష వహించారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. బాపట్ల ఎడ్యుకేషన్ కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల కల్పించుచున్న ఆధునిక వనరులను వినియోగించుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డీ రామమోహనరావు, జాయింట్ సెక్రటరీ కె హరిపద్మప్రసాద్, కోశాధికారి టి రామకృష్ణ, టి సుబ్బారావు, ప్రిన్సిపాల్ షేక్ నజీర్, కళాశాల డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ నిరంజన్ బాబు పాల్గొన్నారు.










