Oct 06,2023 18:16

ప్రజాశక్తి - మండవల్లి
   అవినీతి సమాజానికి పట్టిన పీడ అని అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఇండియన్‌ బ్యాంక్‌ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ వివిఆర్‌ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా ఇండియన్‌ బ్యాంక్‌ మండవల్లి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాగేంద్ర స్వామి కళ్యాణ మండపంలో అవినీతి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ సొంత లాభం కోసం నిజాయితీ లేని మార్గాల్లో వెళ్లడమే అవినీతి అన్నారు. అవినీతిపై బ్రహ్మాస్త్రం ఎసిబి అని తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై 14400 యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను బహిర్గతం చెయ్యరని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్‌ రంగం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. కృష్ణాజిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ టి.సురేంద్ర జయవర్థన్‌ మాట్లాడుతూ అవినీతికి నో చెప్పండి లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరంగా పరిగణించబడతాయన్నారు. అనంతరం అవినీతి నిర్మూలిద్దాం, భారతదేశ పౌరునిగా భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ బి.దుర్గారావు, సర్పంచి మెండ జాన్సీ, శివాలయం ఛైర్మన్‌ కొల్లా కృష్ణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌ భాస్కరరావు, గన్నవరం మాజీ సర్పంచి గుడివాడ వీరరాఘవయ్య, ముద్ర బోయిన సుబ్బారావు, మెండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.