Jan 13,2023 23:53

మాట్లాడుతున్న గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిన్నయ్యపడాల్‌

పజాశక్తి-పాడేరు: గిరిజన రైతుల నుంచి ఐటీడీఏ ద్వారా మాక్స్‌ సొసైటీతో నిర్వహించిన కాఫీ కొనుగోళ్లలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ తెలిపారు. గిరిజన సొసైటీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డ పాడేరు ఐటిడిఏ పిఓ మాక్స్‌ సొసైటీ నిబంధనలను పక్కనపెట్టి టెండర్‌ నిర్వహించి, మాజీ కాఫీ ఏడి భాస్కరరావుతో కలిసి తమకు అనుకూలమైన గుత్తేదారులకు 22 మెట్రిక్‌ టన్నుల కాఫీని చౌకగా అమ్మేశారని విమర్శించారు. గిరిజన సొసైటీ పేరుతో ఒక వెయ్యి 87 మెట్రిక్‌ టన్నుల కాపీ సేకరణ జరిగిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్‌ ఫండ్‌ మూడు కోట్లు విడుదల చేసిందని, ఈ కాఫీ కొనుగోళ్లకు సంబంధించి పాడేరు ఐటిడిఏ పిఓ సాగించిన కాపీ క్రయవిక్రయాలపై విచారణ నిర్వహిస్తే భారీ అవినీతి కుంభకోణం వెలుగు చూస్తుందని చెప్పారు. చింతపల్లిలో శుక్రవారం ఈ కాఫీ కొనుగోలు అవినీతి వ్యవహారంపై విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిసిసి అపెక్స్‌ కమిటీ సభ్యుడైన ఐటిడిఏ పిఓ గోపాలకృష్ణ కాఫీ రైతులకు మద్దతు ధర కల్పిస్తామని మ్యాక్స్‌ సొసైటీ పేరుతో గిరిజన రైతులకు తక్కువ ధర చెల్లించి కాఫీ కొనుగోలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి నష్టపోయిన రైతులకు నగదు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిసిసి మార్కెట్‌ ద్వారా కాపీ రైతులను ఆదుకుంటామని, 2017లో అరకు కాపీ ప్రాజెక్టుకు సుమారు రూ.520 కోట్ల బడ్జెట్‌తో ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులను కేటాయించి 2023 నాటికి ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో గిరిజన రైతులను దళారీ దోపిడీల నుండి రక్షించి స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, జిసిసి వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు బ్లాక్‌ లిస్టులో ఉన్న ఐసిఎస్‌డిసి అనే స్వచ్ఛంద సంస్థను తెరమీదకు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నారు. ఆనాటి అడుగుజాడల్లోనే గిరిజన కాపీ రైతులతో విశాఖ ఏజెన్సీ గిరిజన కాపీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార పరిమితి సంఘం( మాక్స్‌ సొసైటీ )ఏర్పాటు చేసి ఐటిడిఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ పెత్తనం చేస్తున్నారని విమర్శించారు.2022 సంవత్సరాలకు గాను మ్యాక్స్‌ సొసైటీ ద్వారా సుమారు పది లక్షల 80 వేల కేజీల కాపీని సేకరించి రైతులకు మాత్రం రూ.40 చొప్పున నాలుగు కోట్ల 32 లక్షల 80 వేలు చెల్లించారని, సేకరించిన మొత్తం కాపీని ప్రాసెసింగ్‌ చేయగా పార్చ్‌ మెంట్‌ ఒక లక్ష 80 వేల కేజీలు, చెర్రీ కాపీ 41 వేల కేజీలు చొప్పున వచ్చిందని, నాడు జిసిసి ప్రకటించిన ధర ప్రకారం ఒక కేజీకి 10 రూపాయలు చొప్పున బోనస్‌ కింద మాక్స్‌ సొసైటీ రైతులకు తక్కువగా చెల్లించిందని, దీంతో రైతులు ఒక కోటి 80 లక్షల రూపాయలు నష్ట పోయారని తెలిపారు. చెర్రీ, పార్చ్‌ మెంట్‌ కాపీ విక్రయాలకు ఓపెన్‌ టెండర్‌ చింతపల్లిలో నిర్వహించి తర్వాత ఐటీడీఏ కార్యాలయంలో రహస్యంగా పిఓ ఓపెన్‌ టెండర్‌ నిర్వహించకుండా మాజీ కాఫీ ఏడి భాస్కరరావుకు సన్నిహితుడైన వ్యాపారికి కేజీ పార్చ్‌ మెంట్‌ కాపీకి కిలో రూ.294ల చొప్పున, కిలో చెర్రీ కాపీకి రూ.100ల చొప్పున విక్రయించారని తెలిపారు. తమ గుత్తేదారుడుకు కాపీ అప్పగించడంతో మాక్స్‌ సొసైటీ పొందిన సొమ్ము ఐదు కోట్ల 73 లక్షల 14 వేల నుండి కాపీ పళ్ళు సేకరణకు రైతులకు చెల్లించిన సొమ్ము 4 కోట్ల 34 వేల 80 కాగా, రైతులు నష్టపోయిన సొమ్ము ఒక కోటి 38 లక్షల 34 వేలు అని అన్నారు. దీనిలో కాపీ రైతులకు మద్దతు ధర లభించకపోగా నిలువు దోపిడీకి గురయ్యారని తెలిపారు. గత ఏడాది ప్రాసెసింగ్‌ చేసిన కాపీలో, పార్చ్‌ మెంట్‌ కాఫీ 25 వేల కేజీలు తరుగు పేరుతో మాయం చేశారని, ఈ 25వేల కేజీల కాఫీకి గత ఏడాది గుత్తేదారుడు కిలో కాఫీకి రూ.294 చొప్పున చెల్లించిన ప్రకారం 73 లక్షల 50 వేలు స్వాహా చేశారని, ఈ సంవత్సరానికి గాను ఐదువేల మెట్రిక్‌ టన్నుల సేకరణకు 11 మండలాల్లో ఉన్న లైజన్‌ వర్కర్లకు టార్గెట్‌ ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఐటీడీఏ పీవో నిర్ణయం మేరకు మాక్స్‌ సొసైటీ ప్రకటించిన కిలో కాపీపళ్ళ కొనుగోలు ధర రూ.36 కాగా, జిసిసి, నాంది ఫౌండేషన్‌, ప్రకటించిన ధరతో పోలిస్తే ఒక కిలోకు రూ.14 తక్కువని తెలిపారు. సొసైటీ లక్ష్యం మేరకు ఐదు వేల మెట్రిక్‌ టన్నుల కాపీ పళ్ళను ప్రాసెస్‌ చేస్తే సుమారు 850 మెట్రిక్‌ టన్నుల ఫార్చ్యూమెంట్‌ కాపీ 250 మెట్రిక్‌ టన్నుల చెర్రీ కాఫీ ఉత్పత్తి అవుతుందన్నారు. ఐదువేల మెట్రిక్‌ టన్నుల కాపీ రూ.36 చొప్పున చెల్లిస్తే 15 కోట్ల 30 లక్షలు ఖర్చు అవుతుందని ప్రాసెస్‌ చేసిన చెర్రీ పార్చ్మెంట్‌ కాపీని బెంగళూరు మార్కెట్లో అమ్మితే సుమారు 29 కోట్ల 59 లక్షలు వస్తుందని మాక్స్‌ సొసైటీ సమకూర్చిన ఆదాయంతో పోలిస్తే 14 కోట్ల 29 లక్షలు, పళ్ళు సేకరణలో జిసిసి నాంది ఫౌండేషన్‌ ప్రకటించిన ధరతో పోలిస్తే నష్టపోయిన రూ.14 చొప్పున ఐదు మెట్రిక్‌ టన్నులకు గాను సుమారు 70 లక్షలతో కలిపి 2023 సంవత్సరంలో సుమారు 14 కోట్ల 99 లక్షలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అపెక్స్‌ కమిటీ సభ్యులుగా పాడేరు ఐటీడీఏ పీవో కాపీ మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆదుకోవాల్సి న్నా ఒక ప్రైవేట్‌ సంస్థ మాక్స్‌ సొసైటీకి అన్ని తానై నడిపిస్తున్నారని విమర్శించారు. గిరిజన సొసైటీల పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు, గడుతూరి సత్యనారాయణ, సాగిన చిరంజీవి పాల్గొన్నారు.