Oct 31,2023 22:05

ర్యాలీ చేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు


ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌
అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయ సిబ్బంది, అధికారులు మంగళవారం ఉదయం చిత్తూరు పురవీధుల్లో 3కె రన్‌ వాకథాన్‌ నిర్వహించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుండి గ్రీమ్స్‌ పేట శాఖ వరకు 3కె రన్‌ వాక్‌థాన్‌ జరిగింది. బ్యాంకు చైర్మన్‌ ఎఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్‌థాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపారు. రోజువారీ కార్యక్రమాల్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేనివిధంగా, ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అవినీతిరహిత వ్యవహారం అనేది ప్రతి వ్యక్తీ నిబద్ధతతో ఆచరించాల్సిన విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ ద్వారా అవినీతికి లంచగొండితనానికి దూరంగా ఉన్నట్లయితే సమాజం మొత్తం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. 2024 మార్చి నాటికి 25వేల కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యంతో బ్యాంకు నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ పయనంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉమ్మడి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మెరుగైన బ్యాంకింగ్‌ సదుపాయాలను అందజేస్తున్నామన్నారు. కొత్తగా బ్యాంకు ప్రవేశపెట్టిన దీనదయాల్‌ బంగారు ఆభరణాల రుణ పథకం ద్వారా వెనుకబడిన తరగతుల ఖాతాదారులకు కేవలం ఆరు శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తున్నామన్నారు. బ్యాంకు విజిలెన్స్‌ అధికారి రమణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్‌; పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జనరల్‌ మేనేజర్‌ ప్రభాహరన్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.