Dec 24,2022 00:04

విద్యుత్‌శాఖ అధికారిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

ప్రజాశక్తి- చోడవరం
అవినీతి రహితంగా అధికారులు సేవలు అందివ్వాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ హెచ్చరించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని సర్పంచ్‌లు ఫిర్యాదు చేయగా, విద్యుత్‌శాఖ ఏఈ, ఇతర సిబ్బందిపై సభలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దయానీయంగా ఉందని, కాంట్రాక్టర్‌ పనులు సక్రమంగా చేయకపోతే తమకు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల జల్‌ జీవన మిషన్‌ ద్వారా గ్రామాల్లో మంచినీరు అందకుండా పోతుందని పలువురు సర్పంచులు నిలదీశారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ ఉన్న డ్రైవర్‌ లేకపోవడంతో సేవలు అందడం లేదని సభ్యులు తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రతి సమస్యను వచ్చే జనరల్‌ బాడీ సమావేశానికి పూర్తి చేయాలని అధికారులను ధర్మ శ్రీ ఆదేశించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కొత్తగా ఎన్నికైన ఏరువాక సత్యారావును ఎంపీటీసీలు, సర్పంచులు సన్మానించారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేశారు. ఎంపీపీ గాడి కాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహశీల్దారు బి.తిరుమల బాబు, ఎంపీడీవో శ్యామ సుందర్‌, వైస్‌ ఎంపీపీలు బుద్ధ గంగరాజు, కుమారి ఈశ్వరరావు, అధికారులు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.