Sep 12,2023 20:05

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినందుకే జైలుకెళ్లారని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. మంగళవారం కసాపురం ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా, చిప్పగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాల్లో ఇడి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇడి నోటీసులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 2017లో పుణెలో జిఎస్‌టి తనిఖీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువులు తేలాయని తెలిపారు. 2019లో అవినీతి బయటపడిందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేశారని, 14 రోజులు రిమాండ్‌ కూడా విధించారని తెలిపారు. చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కుట్రపన్ని అక్రమ కేసుల్లో ఇరికించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ మధుసూదన్‌ రెడ్డి సమాధానమిస్తూ... అభివృద్ధిని చూసి ఓర్వలేక టిడిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిప్పగిరి మాజీ ఎంపిటిసి బర్మే మల్లికార్జున, ఆదోని మార్కెట్‌ వ్యాపారి రవి పాల్గొన్నారు.