Sep 09,2023 18:14

మహిళలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి అవినీతి, అక్రమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావూరి వారి కండ్రిగ గ్రామంలో చంద్రమోహన్‌ రెడ్డి రచ్చబండ, స్త్రీ శక్తి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్‌ రెడ్డిపై మాజీ మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. కనుపూరు కాలువ పనుల్లో మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నేత సోమిరెడ్డి ఆరోపించారు. కనుపూరు కాలువపై ఇరిగేషన్‌ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, కాలువల పూడికతీతలో అధికారులతో కలిసి రూ.90 కోట్ల అవినీతికి మంత్రి గోవర్ధన్‌ రెడ్డి పాల్పడ్డారని చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. అవినీతిని బ్రాండ్‌ అంబాసిడర్‌ మంత్రి కాకాణి తాను మిల్లర్ల వద్ద దోపిడీ చేశానని ఆరోపించడం విడ్డూరమన్నారు. తనను విమర్శించే స్థాయి మంత్రి కాకాణికి లేదని సోమిరెడ్డి అన్నారు. తమ కుటుంబం ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారు తప్ప, మంత్రి గోవర్ధన్‌ రెడ్డి లాగా ప్రజా ధనాన్ని దోపిడీ చేయలేదని విమర్శించారు. రావూరి వారి కండ్రిగలో తన చిన్నాయన రాధాకష్ణారెడ్డి భూమిని దానం చేసిన సంగతిని ఈ సందర్బంగా మాజీ మంత్రి సోమిరెడ్డి గుర్తు చేశారు. అనంతరం చంద్రమోహన్‌ రెడ్డి మహిళలతో ''బాబు షఉరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ'' నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డికి స్థానిక నేత టీడీపీ నాయకులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి (చిన్న బాబిరెడ్డి) ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్‌ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లిపూడి సుధాకర్‌, ముత్యాలు శ్రీనివాసులు, మన్నెం జితేంద్ర టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.