Aug 28,2023 23:17

ప్రజాశక్తి - పర్చూరు
సిఎం జగన్మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని వైసిపి ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మ్యానిఫెస్టోని పవిత్రంగా భావించిన జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని కొనియాడారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన జేసిఎస్ ఉచిత భీమా నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం తన మ్యానిఫెస్టోని తుంగలో తొక్కిందన్నారు. ఆన్ లైన్లోని మ్యానిఫెస్టోని కూడ మాయం చేసిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని వదిలేసి డబ్బులన్నీ సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. సంక్షేమానికి ఇచ్చే నగదుతో ప్రజలు అభివృద్ధి చెందరా అని ఎదురు ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన ఘనత వైసీపీదేనని అన్నారు. టీడీపీ అనుకూల పత్రికలు ఏది రాసినా ప్రజలు నమ్ముతారనుకోవడం పిచ్చి భ్రమ అన్నారు. ప్రజలు మనకంటే తెలివిగల వారని గుర్తుంచాలన్నారు. నియోజకవర్గంలో 20ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నాయని అన్నారు. విదేశాల్లో స్థిరపడి స్వదేశానికి తిరిగిరాని వారు ఓటర్ల జాబితాలోనే ఉన్నారని తెలిపారు. వారు లేకుండ ఎన్నికల్లో వారి ఓట్లు ఎలా పోలౌతున్నాయని ప్రశ్నించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. వాటిని నిరూపిస్తే ఏమౌతుందో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. మదార్ధంగా ఉన్న ఓట్ల జోలికి తాము వెళ్లట్లేదని అన్నారు. ఫారం 7 పెట్టిన కొందరు బిఎల్ఎలను బెదిరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. జేసిఎస్ కన్వీనర్లు, గృహసారధులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. వాలంటీర్లతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. జేసిఎస్ సిబ్బందికి ఉచిత భీమా సౌకర్యం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పాణ్యం హనుమారెడ్డి, నాయకులు ముప్పాళ్ల రాఘవయ్య, తోకల కృష్ణమోహన్, పఠాన్ కాలేష, జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి, గోరంట్ల శివకుమారి, తులసి నాగమణి, గాదె సురేష్, జంగా అనీల్, ఆకుల హేమంత్, నూతలపాటి బలరాం, కురాకుల ఇస్సాకు, శాంతారావు, ఎర్రాకుల తిరుమలేశ్వరావు పాల్గొన్నారు.