ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఎమ్మెల్యేగా తాను ఎక్కడైనా అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికైనా సరే అవసరం అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం టిడిపి అధినేత పార్వతీపురం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేపై చేసిన అవినీతి ఆరోపణలపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా సమస్యల పరిష్కారం కోసం తన దగ్గరకు వచ్చే దరఖాస్తులపై అండార్స్‌మెంట్ సంతకాలు చేయడాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి తప్పు పట్టడం అన్యాయమన్నారు. నియోజకవర్గంలో తన పేరును గానీ, తన అనుయాయుల పేరున గానీ గజం స్థలం ఆక్రమించినట్టుగా నిరూపించగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ఆయన సోదరులు కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో చేసిన భూముల కబ్జా గురించి ఎవర్ని అడిగినా చెబుతారని, ముందు వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. టిడిపి నాయకులు చేసిన భూకబ్జాలు నిజమైతే అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుతం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టానని ఇకపై ముందు ముందు వారిపై చర్యలకు అధికారులను కలుస్తానని తెలిపారు.
బిటి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
పార్వతీపురం రూరల్/సీతానగరం: మండలంలోని పులుగుమ్మి నుండి సీతానగరం పంచాయతీ రేపటివలసకు గ్రామస్తుల అభ్యర్థన మేరకు హుటాహుటిన రూ.కోటీ 23 లక్షలు నిధులు కేటాయించి నిర్మించిన బిటి రహదారిను గురువారం స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా రహదారికి నోచుకోలేని ఉత్తమ గ్రామానికి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సేవలను గుర్తిస్తూ గ్రామస్తులు ఆయన్ను గుర్రంపై ఊరేగిస్తూ, రహదారి గుండా గ్రామంలోకి తీసుకువెళ్లి సంబరాలు నిర్వహించారు. అంతకుముందు పులుగుమ్మిలో ప్రజల తాగునీరు నిమిత్తం గ్రామంలో రూ.4.30లక్షలు నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకు పైపులైను కొళాయిలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతానగరం మండలాలకు చెందిన వైసిపి నాయకులు పాల్గొన్నారు.










