ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక వికాస్ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. లంచం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వికాస్ విద్యాసంస్థల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సోమవారం నిరసన తెలిపారు. విద్యార్థులు వికాస్ పాఠశాల ప్రాంగణం నుంచి ఆర్‌డిఒ కార్యాలయం ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. వికాస్ పాఠశాలకు అనుమతులు మంజూరు చేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాలల దినోత్సవం రోజున విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీపై పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. ఇటీవల పట్టణంలో వికాస్ పాఠశాలకు అనుమతులు ఇచ్చే వ్యవహారంలో విద్యాశాఖాధికారులపై పాఠశాల కరస్పాండెంట్ దురుసుగా వ్యవహరించారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను విద్య శాఖ అధికారులు లంచం అడిగి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వికాస్ పాఠశాల కరస్పాండెంట్ బహిరంగ ఆరోపణలు చేశారు. ఈ విషయం పట్టణంలో చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో బాలల దినోత్సవం రోజున విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించడం మరింత ఆసక్తిని కలిగించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.










