Jan 18,2023 23:08

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: కనీస జాగ్రత్తలతో, అవగాహనతో రహదారి ప్రమాదాలను నివారించవచ్చని డిటిసి పురేంద్ర అన్నారు. బుధవారం విజయవాడలోని కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో 33వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో ముఖ్యఅతిథి విజయవాడ అడిషనల్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) పి.సర్కార్‌ మాట్లాడుతూ రోడ్డు మీద వాహనం నడిపే వారు ప్రాణం విలువను గుర్తించి వాహనం నడపాలని, రోడ్డు ప్రమాదాల్లో జిల్లా పదో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి మాట్లాడుతూ జాతీయ రోడ్డుభద్రతా వారోత్సవాల్లో 1993 నుండి ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ భాగస్వామ్యం వహిస్తూ పెద్దఎత్తున ప్రచారం, అవగాహన కల్పిస్తూ వస్తోందన్నారు. అందుకుగాను 2001లో నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ అవార్డు, 2003లో అంతర్జాతీయ రహదారి భద్రతా పురస్కారం తమ సంఘం అందుకుందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కోసం బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి గోపిశెట్టి వీర వెంకయ్య, ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు పాల్గొన్నారు.