ప్రజాశక్తి -గాజువాక ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కలిగి, వాటి వాడకాన్ని పూర్తిగా మానేయాలని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జివిఎంసి కమిషనర్ లక్ష్మిశ అన్నారు. శుక్రవారం గాజువాక శ్రీనగర్‌లోని ఆపిల్-ఐ స్కూల్‌లో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథి ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను పిల్లలు తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కమిషనర్ లక్ష్మిశ మాట్లాడుతూ, ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్న ఆశయానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్పొరేటర్ స్టాలిన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు యాపిల్-ఐ స్కూల్ విద్యార్థులు చేస్తున్న కృషిని అభినందించారు. స్కూల్ చైర్మన్ టి.బలరామకృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 5000 నార సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.










