- ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం, ఎచ్చెర్ల: అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యమని ఎస్‌పి జి.ఆర్ రాధిక అన్నారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలు, మైనర్లు మోసపోతున్నారని చెప్పారు. ప్రతి మహిళా పోలీస్ గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి నేర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మహిళా పోలీసులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిలో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆధార్, బ్యాంకు వివరాలు అపరిచిత వ్యక్తులకు తెలియజేయవద్దన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు 1930 హెల్ప్‌లైన్ నంబరును గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించి, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, డిసిఆర్‌బి సిఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ పరిశీలన
ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్‌ను ఎస్‌పి రాధిక పరిశీలించారు. ఆర్మ్‌డ్ రిజర్వు విభాగం గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా సాయుధ దళాల పోలీసు సిబ్బంది, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, డి.ప్రసాదరావు, జి.వి ప్రసాద్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.










