ప్రజాశక్తి -పార్వతీపురం : మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన ప్రధామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణే ధ్యేయం కావాలని అన్నారు. అన్ని విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన నిర్వహించాలన్నారు. విద్యా సంస్థల్లో ఉదయం జరిగే అసెంబ్లీ సమయంలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల పట్ల ఐదు నిమిషాలు విద్యార్థులకు విధిగా తెలియ జేయాలని స్పష్టం చేశారు. ఇందులో 9, 10 తరగతుల విద్యార్థులు విధిగా భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథ రావును ఆదేశించారు. అటవీ ప్రాంతంలో గంజాయి తదితర ఎటువంటి మాదక ద్రవ్యాల పంటలు పండించకుండా నిఘా ఉంచాలని జిల్లా అటవీ అధికారి జిఎపి ప్రసూనను ఆదేశించారు. వన సంరక్షణ సమితి సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పారు. పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎస్‌పి విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణపై ఎస్‌ఇబి పెద్ద ఎత్తున అవగాహన నిర్వహిస్తుందన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి రవాణా అవుతున్నాయని చెప్పారు. జిల్లాలో మాదక ద్రవ్యాల ప్రభావం ప్రస్తుతం లేదని, యువతను సన్మార్గంలో నడిపించడానికి అవసరమైన అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థల సమీపాన మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం వంటి అంశాలుంటే సమాచారం అందించాలని ఆయన చెప్పారు. విద్యా సంస్థల టోల్ ఫ్రీ నెంబరు, ఇతర సమాచారంతో బోర్డులను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఆర్‌టిసి డ్రైవర్లు, కండక్టర్లకు తగిన అవగాహన కల్పించి అనుమానితులుంటే సమాచారం అందించేలా శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన మాట్లాడుతూ జిల్లాలో 74 బీట్లు ఉన్నాయని, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఎఎస్‌పి ఒ.దిలీప్ కిరణ్, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఎఎస్‌పి సునీల్ షరోన్, పాలకొండ డిఎస్పీ జివి కృష్ణా రావు,పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.










