ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం తీసుకురాదలచిన కుటుంబ నియంత్రణ చట్టం గురించి పేపర్‌లో చదవగానే...ఠక్కున మాజీ ప్రధాని ఇందిర తనయుడు సంజరు గాంధీ ఎమర్జెన్సీ రోజుల్లో ముందుండి నడిపించిన బలవంతపు కుటుంబ నియంత్రణ పథకం స్ఫురించింది. దాదాపు అరవై లక్షల మందిని ఆపరేషన్ టేబుల్ ఎక్కించినట్టు గుర్తు. అయితే ఇన్నేళ్లు భారత్‌లో జనాభా విస్ఫోటనం జరుగుతున్నట్టు, ఇప్పుడా రాష్ట్రం సమస్య పరిష్కారానికి ఆదర్శంగా ముందుకి వచ్చినట్టు కాదు. ఎందుకంటే జోరుగానో, మెల్లిగానో జనాభా పెరుగుదలపై చైతన్యం వచ్చింది. ఆ రాష్ట్రంలో కూడా గత దశాబ్దంలో ఆదర్శవంతంగా సంతాన సాఫల్య రేటు 3 నుండి కిందికి దిగి 2.7 కి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణలో మరీ మంచి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాయి. అయితే ఈ విజయాలు అలవోకగా, ఒక పద్ధతిలో, సున్నితత్వంతో కూడిన పథకాలతో, అవి తెచ్చిన అవగాహనతో సాధ్యమయ్యాయి తప్ప బలవంతపు చట్టాలతో కాదు. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలుంటే అన్ని సంక్షేమ పథకాలకు, ఎన్నికల్లో పోటీకి, ఉద్యోగాలకు, ప్రమోషన్‌లకు అనర్హులు చేస్తామని భయపెట్టడం, లేదా తక్కువ పిల్లలున్న వారికి తాయిలాలు ప్రకటించడం ద్వారా కాదు. మహిళా సాధికారిక పథకాలు, విద్య, వైద్యం పై దష్టి పెట్టడం, శిశు మరణాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా మార్పు సాధ్యమౌతూ వస్తోంది.ఆ రాజమార్గాన్ని వదిలి, దండనతో కూడిన రాజదండం ద్వారా సాధిస్తామంటే ఆ ప్రయత్నం వికటిస్తుంది. కొత్త సమస్యల్ని మోసుకు వస్తుంది. కొన్నాళ్ళు వాదనలకు, వివాదాలకు పనికొస్తుంది కానీ అసలు లక్ష్యం అందదు.
- డా. డి.వి.జి.శంకర రావు ,
మాజీ ఎంపీ, పార్వతీపురం.










