ఇంక్విలాబ్ జిందాబాద్ / కిసాన్ ఏక్తా జిందాబాద్ / తీన్ కాలా కానూన్ కో వాపస్ లో / మజ్దూర్ కిసాన్ ఏక్తా జిందాబాద్....ఢిల్లీ సరిహద్దులకు అల్లంత దూరాన్నుండే మాకు వినిపించిన నినాదాలవి. 2020 నవంబర్ 26 నుండి దేశ రాజధాని సరిహద్దుల్లో మారుమోగుతున్న ఈ నినాదాలు నాలుగు నెలలు పూర్తి చేసుకున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల రద్దు కోసం...గడ్డకట్టే చలి లోనూ అన్నదాతల పోరు ఆగలేదు. సుమారు 312 మంది రైతులు ఈ పోరాటంలో అసువులు బాసినాసరే...భుజం, భుజం కలిపి పోరాడుతున్నారు.
'కార్మికలోకం' పత్రిక నుండి కె.స్వరూపరాణి (ఎ.పి), మన వర్కర్ (తెలంగాణ) నుండి ఎం. పద్మశ్రీ, ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్యయ్య గారి సహకారంతో మార్చి 15,16,17 తేదీల్లో ఘాజీపూర్, సింఘూ, టిక్రీ బోర్డరులో కొనసాగుతున్న ఆందోళనలో పాల్గొని, వారి అనుభవాలను తెలుసుకున్నాం.
మొదట ఘాజీపూర్ బోర్డర్‌కు వెళ్లాం. ఇది ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే హైవేలో ఉంది. వ్యవసాయ పనులు వలన మేం వెళ్లిన మూడు క్యాంపుల్లో ఇదే కొంచెం తక్కువ జనసాంద్రత కలిగి ఉంది. అయితేనేం, వారందరూ ఎంతో సమరశీలంగా పోరాటంలో పాల్గొంటున్నారు. మేం క్యాంపు దగ్గరకు చేరగానే ఒక వాలంటీర్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మేం పెట్టుకున్న మాస్క్ తీసి రమ్మని చెప్పారు. మేము వెళ్లిన మూడు క్యాంపుల్లో ఏ ఒక్కరూ మాస్క్‌లు ధరించలేదు. అన్ని టెంట్లనూ పరిశీలిస్తూ ఒక టెంట్ దగ్గర ఆగాం. అక్కడ స్టడీ సర్కిల్ నడుస్తోంది. మమ్మల్ని చూసి కూర్చోమని సైగ చేసి తమ క్లాసును కొనసాగించారు. ఆయన ముజ్రా పోరాటం గురించి, దానికి నేడు జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి ఉన్న సాపత్యాన్ని వివరించారు. అందరూ ఆసక్తితో వింటున్నారు. నాలుగు నెలలుగా పోరాటం సజీవంగా సాగటానికి వారిని చైతన్యపరుస్తున్న ప్రయత్నం మాకు బోధపడింది. స్టడీ సర్కిల్ అనంతరం..మేం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చామని పరిచయం చేసుకోగానే వారు ఎంతో సంతోషించారు. అఖిల భారత కిసాన్‌సభ టెంట్ దగ్గరకు మమ్మల్ని తీసుకువెళ్లారు. అక్కడ మాకు వేడి వేడి పకోడీలు, చారు, మంచినీళ్ల బాటిళ్లు అందించారు. మాకే కాదు. అక్కడకు వచ్చే ప్రతి ఒక్కర్నీ అదే పద్ధతిలో ఆదరిస్తున్నారు.
మేం వెళ్లిన మూడు సరిహద్దుల్లోనూ పర్మినెంట్ వేదికలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మజ్దూర్ కిసాన్ ఏక్తా నాయకుల ప్రసంగాలతో పాటు మద్దతు తెలపడానికి వచ్చిన వారితో వేదిక మీద మాట్లాడిస్తున్నారు. పదేళ్ల పిల్లల నుండి అన్ని వయస్సుల వారు పాల్గొంటున్నారు. మైక్‌లో ప్రసంగాలు మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభ నాయకులు మమ్మల్ని వేదిక దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రతిచోట ఇదేవిధంగా ఆహ్వానించారు.
రెండో రోజు సింఘూ బోర్డర్‌కు వెళ్లాం. ఇది ఢిల్లీ-చంఢగీఢ్ జాతీయ రహదారిలో బాలగఢ్ కి దగ్గరలోని హర్యానా సరిహద్దు. కేంద్ర ప్రభుత్వం రహదారి మూసివేయడంతో సోనీపట్ బస్సులో వెళ్లాం. అక్కడ హర్యానా రోడ్డు వేస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామ్రేడ్ నవీన్ రాణా మమ్మల్ని కారులో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింఘూ బోర్డర్‌కు తీసుకెళ్లారు. 10 కిలోమీటర్లు దాటగానే రైతుల గుడారాలు కనిపించాయి. నవీన్ రాణాను 'అదానీ పానీపట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం భారీ గోడౌన్లు కడుతున్నారట కదా' అనడితే అక్కడే కాక సోనీపట్‌లో కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సింఘూ బోర్డర్ చాలా పెద్ద క్యాంప్. గ్రామాల నుండి కార్లు, ట్రాక్టర్లు, కాలినడకన వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారితో జాతరను మరిపించింది. గ్రామాల నుండి పాలు, కూరగాయలు, రోజూ కావాల్సిన నిత్యావసరాలు సరఫరా అవుతున్నాయి. మూడు చోట్లూ పరిశుభ్రంగా వున్నాయి. ఢిల్లీ నగరం నుండి వచ్చిన అనేక మంది రైతు ఉద్యమానికి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
తొంభై ఏళ్ల నవయవ్వనులు, పాతికేళ్ల పోరాట వీరులను చూశాం. వేదిక పైన, వేదిక ముందు అనుభవజ్ఞులు, ఎండలో, వానలో అహర్నిశలు చెమటోడ్చి పంట పండించే రైతన్నలు కన్పించారు. వీరినా మోడీ ప్రభుత్వం దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, ఖలిస్తానీలు, పరాన్నభుక్కులని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నది. పైగా వ్యవసాయాభివృద్ధి, రైతు శ్రేయస్సు కోసం తెచ్చిన చట్టాలు రైతులకు అర్ధం కాలేదని, ఈ చట్టాలను సమర్ధించుకునేందుకు దేశ ప్రజల ముందు రైతులను దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది అనిపించింది. 'మజ్దూర్ కిసాన్ ఏక్తా జిందాబాద్, మోడీ ముర్దాబాద్' నినాదాలు ఉత్సాహాన్నిచ్చాయి.
మూడో రోజు మా మజిలీ టిక్రీ బోర్డర్. ఇక్కడి వాతావరణం మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ కిందనే ఆందోళనకారుల క్యాంప్. మేం ఢిల్లీ నుండి మెట్రో దిగేసరికే మా కోసం రోహిత్ డిపో నాయకులు కామ్రేడ్ హిమ్మత్ రాణా, సత్బీర్ మాల్ సిద్ధంగా ఉండి మాకు క్యాంపు మొత్తం చూపించారు.
ఢిల్లీ నుండి రోహతక్ వెళ్లే దారిలోని ఈ సరిహద్దు దగ్గర ప్రభుత్వం మూడు అడుగుల గోడ నిర్మించి రాకపోకలు నిలిపివేసింది. జనవరి 26 సంఘటన పునరావృతం కాకుండా గోడలు కట్టామని, మేకులు కొట్టామని ప్రభుత్వం చేసిన ప్రకటన అబద్ధమని ఈ గోడ రుజువు చేసింది. అందోళన మొదలైన కొద్దిరోజులకే ఈ గోడ నిర్మించడం గమనార్హం. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. కుటుంబాలతో సహా వచ్చేపోయే ట్రాక్టర్లతో కోలాహలంగా ఉంది. మేం వారికి సంఘీభావం చెప్పటానికి వచ్చామని అర్థమై దారిపొడవునా మాకు స్వాగతం చెప్పారు. నిత్యం గ్రామాల నుండి స్వచ్ఛందంగా పాలు, కూరగాయలు, తినుబండారాలు సప్లై చేస్తున్నారు. సరిహద్దు నుండి బహదూర్ ఘర్ దాకా ఎనిమిది కిలోమీటర్ల పొడుగునా గుడారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మాకు మాట్లాడే అవకాశం కల్పించారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా సిఐటియు కార్మిక-కర్షక పోరు యాత్ర చేపట్టిందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని, ఢిల్లీ సరిహద్దుల్లో ఏం జరుగుతున్నదో కార్మిక వర్గానికి తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో కార్మిక-కర్షక వ్యతిరేక చట్టాలకు నిరసనగా జరిగే ఐక్య ఉద్యమంలో పాల్గొనేందుకు కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నామని మేం చెప్పటంతో వారి నుండి అపూర్వ స్పందన, ఆదరణ వచ్చింది. 'మా పోరాటం గురించి మీ రాష్ట్ర ప్రజలకు తెలపాల'ని కోరారు. వేదిక దిగి వస్తున్న మా దగ్గరికి తొంభై ఏళ్ళ వృద్ధుడు వచ్చి తల మీద చెయ్యి వేసి 'జీతే రహో బేటీ' అని దీవించటం మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసింది.
రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలకు రైతాంగ ఆందోళన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో మేము గ్రహించిన, గమనించిన కొన్ని ప్రధానమైన అంశాలు...
ఒకే ఎజెండాపై 120 రోజులకు పైగా సుదీర్ఘ పోరాటం జరగటం మాములు విషయం కాదు. వారు ఎంత విజయవంతంగా కొనసాగుతున్నారో ప్రత్యక్షంగా చూసిన తర్వాత మాకు అర్ధమైంది. వారి
ఉక్కు క్రమశిక్షణ, నిబద్ధత ఇందుకు ప్రధాన కారణం. వేదిక నిర్వహణలోనూ, ప్రతి ఒక్కరూ పనిలో పాలుపంచుకోవటంలోనూ మనకు కనిపిస్తుంది.
టిక్రి బోర్డర్‌లో ''జన్ స్వాస్త్ అభియాన్'' (ప్రజారోగ్య వేదిక) వారి టెంట్‌లో రిటైర్డ్ సర్జన్లు, డాక్టర్లను కలిశార. రైతులు ఇన్ని రోజులు, మాస్క్‌లు లేకుండా, ఎంత సమూహంగా నివసిస్తున్నా వాళ్ళకు కరోనా సోకకపోవటానికి కారణం వారి రోగనిరోధక శక్తేనని చెప్పారు. అక్కడి రైతులకు బి.పి, మోకాళ్ల నొప్పులు తప్ప ఇతర అనారోగ్యాలేవీ లేవని చెప్పారు.
కలుపు మొక్కలు పీకినోళ్లం-నల్ల చట్టాలు పీకలేమా అని రైతులు మరింత పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సింఘూ, టిక్రీ ప్రాంతాల్లో ఇటుకలతో, కర్రలతో ఇళ్లు కడుతున్నారు. ఉద్యమంలో వాసి ఏ మాత్రం సడలలేదని మార్చి 23 భగత్ సింగ్ వర్థంతి, మార్చి 26 బంద్ పెద్ద ఎత్తున జయప్రదం కావడాన్నిబట్టి అర్థమైంది.
ప్రతి గ్రామం నుండి వంతుల వారీగా కుటుంబాలతో వచ్చి కనీసం పది రోజులు పాల్గొంటున్నారు. అందువల్లనే జనవరి 26 తర్వాత సద్దుమణుగుతుంది అనుకున్న ఉద్యమం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంది.
పంట మార్పిడి సమయం కావటం వల్ల మహిళలు వ్యవసాయ పనులకు వెళ్ళారు. మరి కొంతమంది మార్చి 26 బంద్‌కు గ్రామస్తులను సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. అయినా సరే క్యాంపులో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహిళలు అద్వితీయమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ పనులు, మరో వైపు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ పోరాట కేంద్రాల్లో వంతులవారీగా పాల్గొంటున్నారు. టెంట్‌లో ఉన్న మహిళలతో మాట్లాడితే ఈ ఉద్యమం 'మా కోసమే కాదు. మొత్తం దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించుకునేందుక'ని చెప్పారు. రైతు పక్షమా? కార్పొరేట్ల పక్షమా? తేల్చుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సవాలు విసురుతున్నామని, నల్ల చట్టాలు రద్దయ్యే వరకూ మా ఉద్యమం ఆగదని, ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నామని, ఉద్యమం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నల్ల చట్టాలను ప్రకటించాక... పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ తదితర రాష్ట్రాల్లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ చట్టాలు అమలయితే గనుక కోట్ల విలువ చేసే వ్యవసాయ రంగ మార్కెట్ కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతుంది. మా పొలాల్లోనే కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి. లేదా మోడీని రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలి. లేకపోతే రైతుల జీవితాలు అల్లకల్లోలం అవుతాయని చెప్పారు.
ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ పోరాటం నుండి ఎన్నో విలువైన అనుభవాలను, పాఠాలను తీసుకోవాలి. కార్మిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ స్ఫూర్తితో కార్యోన్ముఖులం కావాలి.
కె. స్వరూపరాణి, ఎం. పద్మశ్రీ










