Jul 30,2023 21:50

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
             సంఘ సేవకులు, నిరంతరం సేవా కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా ఉంటూ 40 ఏళ్లపాటు సమాజ సేవలో ఉంటూ వస్తున్న చెరుకువాడ రంగసాయి ఎపిజె అబ్దుల్‌ కలాం జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం గొప్ప విశేషమని పలువురు వక్తలు అన్నారు. స్థానిక క్విట్‌ఇండియా స్థూపం వద్ద పట్టణ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోకస్‌ నాటక సంస్థ అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, ఎపి ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం.సీతారాంప్రసాద్‌ మాట్లాడుతూ నిత్యచైతన్య స్రవంతి రంగసాయి అని, అనునిత్యం సేవా కార్యక్రమా లతోనే జీవితం సాగిస్తున్న రంగసాయి మరెన్నో అవార్డులు అందుకోవాలన్నారు. కళారంజని నాటక పరిషత్‌ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ నెల 27న విజయవాడ ఐలపురంలో జరిగిన పిలంత్రోపిక్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సభలో రంగసాయి ఎపిజె అబ్దుల్‌కలాం జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం గొప్ప విశేషమన్నారు. కె.శిరిష, కె.ఇందిర, ఎస్‌కె.చాన్‌బాషా రంగసాయి సేవలను కొనియాడారు. రంగసాయి మాట్లాడుతూ అందరూ తనను ఆదరించడమే ఈ స్థాయికి కారణమన్నాపరు. అనంతరం రంగసాయిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం.సరోజిని, భట్టిప్రోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు.