రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య కొన్ని వివాదాస్పద అంశాలపై ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం మంచిది కాదు. మీడియాలో వాటి చుట్టూ పుంఖానుపుంఖాలుగా వార్తలు, కథనాలు రావడంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అటు ఆర్థిక మాంద్యం, ఇటు కోవిడ్ మహమ్మారి జనాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఇలాంటి చర్చ సాగడం వాంఛనీయం కాదు. నిజానికి శాసన, న్యాయ, పరిపాలనా వ్యవస్థల మధ్య భారత రాజ్యాంగం స్పష్టమైన విభజన చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్మణ రేఖను ఎవరు దాటినా అది క్షంతవ్యం కాదు. ఈ మూడు వ్యవస్థలూ ఒకదానికింకొటి వ్యతిరేకంగా లేదా న్యూనత పర్చే విధంగా వ్యవహరిస్తే అవి మూడూ బలహీన పడతాయి. ఇవి పరస్పరం ప్రభావితం చేసే వ్యవస్థలు కనుక వాటి మధ్య పూర్తి సమన్వయం అవసరం. ప్రస్తుతం సమతుల్యత దెబ్బ తినడం విచారకరం.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఎ.పి హైకోర్టు, రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సి.ఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 6న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కొందరు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు అమరావతి పరిధిలో స్థిరాస్తులు కొనుగోలు చేసిన విషయాన్నీ అందులో ప్రస్తావించారు. సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఇలా లేఖ రాయడాన్ని సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా కొందరు న్యాయవాదులు ఖండించారు. న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తులతో సహా చట్టాలకు ఎవరూ అతీతులు కారు. అవినీతి, బంధుప్రీతి వంటి ఆరోపణలు న్యాయమూర్తులపై వచ్చినపుడు, అవి కూడా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం నుండి వచ్చినపుడు సదరు ఆరోపణల నిగ్గు తేల్చడానికి న్యాయవ్యవస్థ చొరవ చూపితేనే దాని ప్రతిష్ట, విశ్వసనీయత నిలబడతాయి; బలపడతాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగుల విషయంలో సర్కారు చర్యను హైకోర్టు తప్పుబట్టింది. ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిన సందర్భంలో హైకోర్టు తన తీర్పు ద్వారా దానిని సరిదిద్దింది. రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగంగా పరిగణించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు అంశమూ హైకోర్టు ముందుకెళ్లడం, పరిష్కారం కావడం తెలిసిందే. మాజీ అడ్వకేట్ జనరల్‌పై విచారణ అనుమతించరాదంటూ వేసిన ఓ కేసులో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడాన్ని పలు హక్కుల సంస్థలు, ప్రజాతంత్ర వాదులూ నిరసించారు. జడ్జిల పైన, కోర్టుల పైన సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టింగ్‌ల విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర శాసన సభాపతి చేసిన వ్యాఖ్యలపైనా హైకోర్టు స్పందించింది. తీర్పు రిజర్వులో వున్నా అది ఒక వివాదాస్పద అంశమే!
కోర్టు ధిక్కారం పేరిట ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం కోర్టు శిక్ష (జరిమానా రూపాయే అయినా) విధించడం ధర్మం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థుల బాధలపై స్పందించిన తమిళ నటుడు సూర్య కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మద్రాసు హైకోర్టు భావించడం, తీవ్ర విమర్శలు వచ్చాక వెనక్కు తగ్గడం తెలిసిందే. ఇలాంటి వివాదాలు రాష్ట్రంలోనేగాక బయటా వున్నాయి. దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు, బలహీన వర్గాల పట్ల వివక్ష వంటి సామాజిక రుగ్మతలను దునుమాడాలి. ఆర్థిక మాంద్యం, కోవిడ్ మూలంగా బాధలు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ఇందుకు మూడు రాజ్యాంగ వ్యవస్థలూ పరస్పర సమన్వయంతో వ్యవహరించాలి. వ్యవస్థలకు అధికారాలే కాదు, పరిమితులూ ఉంటాయి. వాటిని విస్మరించరాదు. అప్పుడే ప్రజాస్వామ్యం సవ్యంగా నడుస్తుంది. దానికి భిన్నంగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇలాంటి వివాదాలకు తావివ్వడం అవాంఛనీయం.










