Nov 27,2022 23:51

ప్రముఖ రచయిత్రి హైమావతిని సత్కరిస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : వర్తమాన రచయితల సంఘం ఆధ్వర్యాన స్థానిక చిన్న బజారు శ్రీనివాస కల్యాణ మండపంలో ఔత్సాహిక రచయితల శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విశాఖ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వివిఎన్‌ బాబ్జీరావు మాట్లాడుతూ, వర్తమాన రచయితల సంఘం ఏర్పాటు అభినందనీయ మన్నారు. ప్రముఖ రచయిత, ప్రభుత్వ రంగ బీమా సంస్థ విశ్రాంత అధికారి డాక్టర్‌ ఎం.సుగుణారావు, ప్రముఖ రచయిత్రి పి.హైమావతి మాట్లాడుతూ, ఔత్సాహిక రచయితలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్తమాన రచయితల సంఘం నిర్వాహకులు పి.రాజేంద్రప్రసాద్‌ వర్మ మాట్లాడుతూ, స్పందించే హృదయం ఉంటే ఎన్నో రచనలు మన కలం ద్వారా జాలువారుతాయని తెలిపారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే రచనలు అవసరమని స్పష్టం చేశారు. ఓ మంచి కథ సమాజ హితానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంఘం నిర్వాహకులు బివి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు.