ప్రజాశక్తి-విశాఖపట్నం : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండిస్టియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. ఈనెల 20వ తేదీ నాటికి సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 115 దరఖాస్తులు రాగా అందులో 74 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించామని, 10 దరఖాస్తులు తిరస్కరించినట్లు తెలిపారు. మిగిలిన 31 దరఖాస్తులు ఎస్‌ఎల్‌ఎ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అప్లికేషన్లు పెండింగ్ లేకుండా చూడాలని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారిని ఆదేశించారు. గాజువాకలో నిర్మిస్తున్న కార్మిక రాజ్య బీమా ఆసుపత్రికి సంబంధించి అన్ని అనుమతులు సత్వరం మంజూరు చేయాలని జివిఎంసి, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహికులకు గతంలో కేటాయించి తిరిగి తీసుకున్న ఐలా భూములలో 72 మందికి గానూ 54 మందికి తిరిగి కేటాయించామని, మిగిలిన 18 మందికి కూడా సత్వరమే కేటాయించాలని ఎపిఐఐసి జోనల్ అధికారిని ఆదేశించారు. గాజువాక ఆటోనగర్‌లో వివిధ పరిశ్రమలకు జీవీఎంసీ ద్వారా త్వరలోనే నీటి సరఫరా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పెందుర్తి మండలం గుఱ్ఱంపాలెంలోని పరిశ్రమల ప్రాంతానికి ఐలా హోదా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. మధురవాడ ఐటి పార్క్ నందు బస్ సౌకర్యం కల్పించాలని, పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటుచేయాలని ఆర్‌టిసి, పోలీస్ అధికారులను ఆదేశించారు. 23 మంది పారిశ్రామికవేత్తలకు రూ.85,28,444 ప్రోత్సాహకాలు అందించినట్లు తెలిపారు. గాజువాకలో ఆటోనగర్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాలని ఎపిఐఐసి, ఐలా అధికారులను ఆదేశించారు. ఆటోనగర్‌లో హరిత వనాలను విరివిగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఐలా కమిషనర్‌కు సూచించారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కాలుష్య ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వరరాజు, ఎపిఐఐసి జెడ్‌ఎం రంగయ్య, ఐలా చైర్మన్ రఘు, ఐలా ఆటోనగర్ ప్రెసిడెంట్ బాలాజీ, చిన్న పరిశ్రమల ప్రెసిడెంట్ సాంబశివరావు, ఎంఎస్‌ఎంఇ ఎడి శ్రీను, ఏపీ ట్రాన్స్‌కో, జీవీఎంసీ, వ్యవసాయ, మత్స్య శాఖ, అగ్ని మాపక, టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.










