Mar 27,2022 13:29

చిన్ని చిన్ని ఆకులతో సుగంధాలు గుప్పించే మొక్క తులసి. మెండుగా ఔషధాలు నిండి ఉన్న ఈ మొక్క తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చాలా మంది దీన్ని కుండీల్లో పెంచుకుంటారు. దీని శాస్త్రీయనామం ఓసిమం టెన్యూఫ్లోరం. ఇది పొద జాతి మొక్క. ఇటీవల వీటి వాడకం విపరీతంగా పెరిగింది. పూలమాలల్లో, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, ఫేస్‌ వాష్లు, ఇతర లోషన్లు, తేనీరు(టీ) తయారీలోనూ తులసిని వాడటంతో తులసి ఆకులకు గిరాకీ పెరిగింది. అయితే తులసిలోనూ అనేక రకాలున్నాయి. అవేంటి.. ఎలా పెరుగుతాయి వంటి విషయాలు తెలుసుకుందాం..

నాటిన నాటి నుంచే చక్కగా పెరిగి ఆకులిచ్చే మొక్క తులసి. తులసికి నీటి వనరు అవసరం ఎక్కువ. కరివేపాకులా తులసి ఆకులను కత్తిరించే కొలదీ కొత్త ఆకులు విచ్చుకుంటాయి. తులసి సారవంతమైన బంకమన్ను నేలలు నిస్సారమైన గులక, క్షార గుణం కలిగిన వివిధరకాల నేలల్లో పెరుగుతుంది. నీరు నిలువని నేలల్లో తులసి ఆకుల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తులసి విత్తనాలు వేసిన 95 నుండి 100 రోజులకు తులసి ఆకుగాని, విత్తనాలు గాని సేకరించుకోవచ్చు. తరువాత ప్రతీ మూడు నెల్లకోసారి పంట సేకరించుకోవచ్చు.

ఔషధాల నిధి.. తులసి


                                                                   కర్పూర తులసి..

ఓసీమం కిలిమాండ్స్చారికమ్‌ శాస్త్రీయ నామంతో పిలిచేది కర్పూర తులసి. ఆకులు పచ్చగా ఉన్నప్పటికీ పువ్వులు లేత నీలంగా ఉండి, గింజలను పొదిగి ఉంటాయి. గింజలే విత్తనాలుగా మారతాయి. ఈ రకం తులసి నుంచే గింజలే సబ్జాలు. ఆకులు మామూలు తులసి కంటే కాస్త విభిన్నంగా ఉంటాయి. సన్నగా పొడవుగా త్రిభుజాకారంగా ఉంటాయి. ఈ మొక్కలు కాస్త పెద్దగా, పొదలా పెరుగుతాయి. ఒక్కసారి మొక్క నాటితే విత్తనాలు కిందపడి వాటికవే మొలుస్తాయి. ఏళ్ల తరబడి బతికే వీటిని సబ్జాల కోసం భారీ ఎత్తున సాగు చేస్తున్నారు.

 

ఔషధాల నిధి.. తులసి




                                                                  లక్ష్మీ తులసి..

ఇళ్లల్లో కోట కట్టుకుని పెంచుకునే మొక్క లక్ష్మీ తులసి. ఐదడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకులు ఘాటైన వాసన వస్తాయి. పొడవాటి గెలలు విచ్చుకుని, విత్తనాలు కాస్తాయి. దీన్ని మాలలు కట్టి అలంకరణకు వాడతారు. టీలలో కూడా ఉపయోగిస్తారు.

 

ఔషధాల నిధి.. తులసి


                                                                మింట్‌ తులసి..

ఆకులు కొత్తిమీరలా ఉంటాయి. తుంచితే సుగంధాలను గుప్పిస్తుంది. నీళ్లు లేదా ద్రావణాల్లో వేయగానే పరిమళ కషాయం దిగుతుంది. అందువల్ల పానీయాల్లోనూ, ఆహారపదార్థాల్లోనూ దీన్ని వాడతారు. మొక్క రెండడుగులు లోపే పెరుగుతుంది. గుబురుగా, దట్టంగా పెరుగుతుంది. ఇళ్ల దగ్గర కుండీల్లోనూ, పంటగా పొలాల్లోనూ పెంచుతున్నారు.

 

ఔషధాల నిధి.. తులసి



                                                                     కృష్ణ తులసి..

ఆకులు కాస్త నీలంగా, మేఘవర్ణ ఛాయలో ఉంటాయి. పూలు కూడా నీలంగానే ఉంటాయి. దీనికి రెండుపూటలా నీరు అవసరం. ఈ కృష్ణ తులసిని వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని కుండీల్లోనూ నేల మీదా పెంచుకోవచ్చు.

 

ఔషధాల నిధి.. తులసి



                                                                    కపూర్‌ తులసి..

కపూర్‌ తులసి లేదా హెవీ ఫ్లవర్డ్‌ బాసిల్‌ అనే తులసి కీటకాలు, దోమలను దూరంగా ఉంచగలదు. దీని నుంచి వచ్చే తీపి వాసన కారణంగా కీటకాలు దూరంగా ఉంటాయి. ఆకులు కాస్త మందంగా ఉండి, లేత నీలిరంగు పువ్వులు గుత్తులుగా పూస్తుంది. కాస్త పొట్టిగా ఉండే దీన్ని కీటకాల కాటు చికిత్సలో ఉపయోగిస్తారు.

 

ఔషధాల నిధి.. తులసి



                                                                        అడవి తులసి..

ఆకులు దళసరిగా, మృదువుగా ఉంటాయి. వీటికి పూసిన గుత్తుల నుంచి నీలిరంగు పువ్వులు విచ్చుకుంటాయి. ఇవి పొలాల్లో కలుపు మొక్కల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఆకులు తుంచితే ఘాటైన వాసన వస్తుంది.

 

ఔషధాల నిధి.. తులసి



                                                                       వన తులసి..

వన తులసి మన దేశంతోపాటు శ్రీలంక, ఆఫ్రికా ప్రాంతాలకు చెందినది. వన తులసి శాస్త్రీయ నామం ఓసిమమ్‌ గ్రాటిస్సిమమ్‌. ఇది అధిక సుగంధం కలిగి, ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది. రెండు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీనిలో ఉండే బలమైన యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506