Nov 17,2022 23:03

సదస్సు ప్రారంభిస్తున్న గీతం విసి దయానంద

అంతర్జాతీయ సదస్సులో గీతం విసి ప్రొఫెసర్‌ దయానంద
ప్రజాశక్తి- మధురవాడ:
పరిశోధించిన ఔషధాల ప్రయోగ ఫలితాలకు జంతువులపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉందనిగీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం అన్నారు. నైతిక అంశాలకు తోడు చట్టాలకు లోబడి ప్రయోగాలను చేయాల్సిన పరిస్థితుల్లో జాప్యం జరగకుండా ఉండాలంటేఇది అవసరమన్నారు.గురువారం గీతం విశ్వవిద్యాలయం వేదికగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌, వ్యాస్‌ కేన్సర్‌ రీసెర్చి పార్క్‌, ఎకాస్టా హెల్త్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'అడ్వాన్సెస్‌ ఇన్‌ యానిమల్‌ మోడల్స్‌ అండ్‌ కటింగ్‌ ఎడ్జ్‌ రీసెర్చి ఇన్‌ ఆల్టర్‌నేటివ్స్‌' అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్య్రం తొలినాళ్లలో యాంటీ బయోటిక్‌ ఔషధాలకు పాశ్చాత్య దేశాలపై ఆధారపడే భారత్‌, నేడు పది శాతం ఔషదాలను, ఐదు శాతం వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు. అయినా నేటికీ కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులకు ఔషధాలను కనిపెట్టాల్సి ఉందన్నారు. దేశంలోని ఔషధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాలయాలలోని మేధావులు సమిష్టిగా కృషితో ఇది సాకారమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న మూడేళ్లలో గీతంలోని ప్రయోగశాలలను పరిశోధనలకు అనువుగా రూ.40 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.
. గీతం సైన్స్‌ కోర్సుల డీన్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.బాలకుమార్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రెడ్డన్న, వ్యాస్‌ కేన్సర్‌ రీసెర్చి పార్క్‌ సిఇఒ డాక్టర్‌ మందర్‌ కులకర్ణి, సదస్సు నిర్వహక అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ పూసల మాట్లాడారు. కార్యక్రమంలో ఎరెజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉపాధ్యాక్షురాలు డాక్టర్‌ ప్రతిమా శ్రీవాత్సవ, డాక్టర్‌ భరద్వాజ పాల్గొన్నారు.