ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనం తరచూ ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఔషధ నిధి అయిన మునగాకుతో వెరైటీ వంటలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
గారెలు
కావాల్సిన పదార్థాలు : మునగాకు - రెండు కప్పులు, శనగపప్పు - కప్పు, పెసరపప్పు - అరకప్పు, సన్నగా తరిగిన అల్లం - టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి - టీ స్పూను, ఉల్లిపాయ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, పసుపు - చిటికెడు, జీలకర్ర - స్పూను, నూనె - తగినంత.
తయారుచేసే విధానం :
- శనగపప్పు, పెసరపప్పును గంట నానబెట్టి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- అందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు, మునగాకు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
- పాన్‌లో నూనె పోసి, బాగా కాగాక ఈ పిండిని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకొని నూనెలో వేగించుకోవాలి. అంతే కరకరలాడే మునగాకు గారెలు తినడానికి రెడీ.
రొయ్యల కూర
కావాల్సిన పదార్థాలు : నూనె- రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు- రెండు రెబ్బలు, మునగాకు- రెండు కప్పులు, చిన్న రొయ్యలు- పదిహేను, ఉప్పు, పసుపు- తగినంత, కొబ్బరి తురుము- కప్పు, ఎండుమిర్చి- నాలుగు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, జీలకర్ర- టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం :
- రొయ్యల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి.
- కొబ్బరి తురుము, ఎండుమిర్చి, వెల్లులి, జీలకర్రను మిక్సీలో మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి.
- స్టౌమీద పాన్ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి.
- అవి వేగాక మునగాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలపాలి.
- మునగాకు ఉడికిందనుకున్నాక శుభ్రం చేసుకున్న రొయ్యలు, కొబ్బరి మిశ్రమం వేసి కలిపి స్టౌని మీడియంలో పెట్టాలి. ఇది పొడి కూరలా అయ్యాక దింపేయాలి.
అవిసె గింజల పొడి
కావాల్సిన పదార్థాలు : మునగాకు - 250 గ్రాములు (శుభ్రమైనది), అవిసె గింజలు - 50 గ్రాములు, కరివేపాకు - 50 గ్రాములు, పచ్చిశనగపప్పు - 10 గ్రాములు, వేరుశనగ పప్పు - 50 గ్రాములు, వెల్లుల్లి - రెబ్బ (ఇది టేస్ట్ పెంచుతుంది), ఎండుమిర్చి - సుమారు ఆరు (ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోవచ్చు), ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు, చింతపండు - కొద్దిగా, నువ్వులు -రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు, పసుపు - తగినంత.
తయారుచేసే విధానం :
- మునగాకు, అవిసె గింజలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, నువ్వులను ఒకదాని తర్వాత ఒకటి సిమ్‌లో వేగించి పక్కన పెట్టుకోవాలి. చివరిలో కొద్దిగా పసుపు కూడా వేసి, కలుపుకోవాలి.
- అన్నీ చల్లారిన తర్వాత ఉప్పుతో సహా అన్నింటినీ కలిపేయాలి. వాటిని మిక్సీలో పొడిలా వేసుకోవాలి. దీని పొడి మెత్తగా ఉండదు.
- కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ... అదిరిపోతుందంతే.
రాగి రొట్టె
కావాల్సిన పదార్థాలు : రాగిపిండి- కప్పు, మునగాకు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, ఆవాలు- చెంచా, మినపప్పు- టేబుల్ స్పూను, నూనె- పావు కప్పు.
తయారుచేసే విధానం :
- స్టౌమీద పాన్ పెట్టి, రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, మినపప్పు వేయించి.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి.
- ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆ ముక్కలు ఉడికిన తర్వాత స్టౌని కట్టేయాలి.
- అందులో రాగిపిండి వేసి, అవసరమైతే నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలపాలి. తర్వాత పిండి అద్దుకుంటూ మందంగా రొట్టెలా చేసి పెనం మీద వేసి మూత పెట్టాలి.
- ఒకవైపు కాలాక రెండోవైపు తిప్పి, కొద్దిగా నూనె వేసి ఎర్రగా కాల్చుకుని తీసెయ్యాలి. ఇదే విధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.