'ఏమ్మా! ఏం కావాలి మీకు? మీ మనవడినిగానీ మనవరాలినిగానీ ఆరవ తరగతిలో చేర్పించటానికి వచ్చారా?' నా గది దగ్గర కొచ్చి నిలబడిన ఆమెను చూసి అడిగాను. ఆమెకి సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. వేసవి శెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు తెరుచుకోవడంతో ప్రవేశాల హడావిడితో ఉంది.
'లేదు బాబయ్యా, నేనే ఆరవ తరగతిలో సేరదామని, ఐదో తరగతి వరకు సదివించి మానిపించేసాడు మా అయ్య అప్పట్లో' అంది.
'ఇప్పుడు ఈ వయస్సులో మరల చదువుకోవాలని ఎందుకనిపించిందమ్మా?' అడిగా ఒకింత ఆశ్చర్యంతో.
'ఏం సెప్పమంటావు బాబయ్యా, మా ఆయనెప్పుడో గతించాడు. రెక్కలు ముక్కలుగా సేసుకుని పెంచిన ఒక్కగానొక్క కొడుకు రెక్కలొచ్చేసరికి నన్నిడిసి పెట్టేసాడు. మొన్నటివరకు ఒంట్లో ఓపికుండటంతో ఆ పనీ ఈ పనీ సేసుకుంటూ ఒకింత వండిపడేసుకుని, తింటూ కాలక్షేపం సేసేదానిని. ఇప్పుడు ఒంట్లో ఓపిక సన్నగిల్లడంతో ఏ పనీ సేయలేకపోతున్నా. అడుక్కుని తినడానికి నా మనసొప్పటం లేదు. నామోషిగా ఉంది బాబయ్యా, అందుకే బళ్ళో సదువుకునే వాళ్ళకు మద్దేనం బువ్వ పెడతున్నారు కదా! అందుకే బళ్ళో సేరాలని ఉంది బాబయ్యా' అంది.
ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. అయినా చేసేదేంలేక, 'రూల్స్ ఒప్పుకోవమ్మా' అంటూ, ఆతృతను అణుచుకోలేక అడిగా 'వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కదమ్మా?' అని.
'నిజమే బాబయ్యా! వద్ధాప్య పెన్షన్ వస్తుంది. ఆ డబ్బులు పెట్టే మందూమాకూ కొనుక్కుంటున్నాను. తినడానికేది?' అంది.
'సరేనమ్మా, మరి నేను చేయగలిగిందేమీ లేదు!' అనటంతో నిరుత్సాహంతో వెనుదిరిగింది.
మరునాడు మధ్యాహ్నం భోజన సమయంలో ఓ మూలగా ఆ ముసలమ్మ సత్తుగిన్నెలో అన్నం తింటూ కనిపించింది. ఆశ్చర్యపోతూ అడిగా 'ఎవరు పెట్టారమ్మా నీకు భోజనం?' అని.
నోటిలో ముద్ద ఉందేమో తన ఎంగిలి చేతి వేలితో దగ్గరలోనే నిలబడి ఉన్న 9వ తరగతి చదివే ప్రతాప్ కేసి చూపించింది.
ప్రతాప్‌తో 'ఏరా, నువ్వేనా, నీకు పెట్టిన మధ్యాహ్న భోజనాన్ని ఆమెకు పెట్టావా?' అని అడిగా.
దానికి వాడు 'నిజమే సార్, నేనే పెట్టానండి, నిన్న మీరు, ఆ మామ్మ మాట్లాడుకున్న అన్ని మాటలూ విన్నానండి. నాకు చాలా జాలి వేసిందండీ. మీ మాటలతో నీరసంగా ఆ మామ్మ వెనుతిరిగి వెళ్లిపోతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ''మామ్మా, రేపు మధ్యాహ్నం భోజనం టైమ్‌కి రా, నేను పెడతాను!'' అన్నానండీ. ఇంటికి వెళ్లాక మా అమ్మతో ''ఓ మామ్మ బడిలో మధ్యాహ్న భోజనం కోసం అడిగింది, సార్ కుదరదన్నారు. నాకు క్యారేజీ పెట్టియ్యి, నాకు మధ్యాహ్నం పెట్టే భోజనం ఆ మామ్మకి పెడతా!'' అన్నాను. మా అమ్మ ఎంతో సంతోషపడి నాకు క్యారేజీ ఇచ్చి పంపించిందండి! నాకు పెట్టిన మధ్యాహ్న భోజనం మామ్మకి పెట్టి, నేను మా అమ్మ క్యారేజీలో పెట్టింది తిన్నానండి.మాకులానే ఇలాంటి వాళ్లకీ ప్రభుత్వం అన్నం పెడితే బాగుంటుంది సార్!'' అనేసరికి వాడి ఔన్నత్యం ముందు నా సంస్కారం వెలవెలబోతూ కనిపించింది.
ఎందుకంటే నాకు ఆ ఆలోచన రానందుకు. ఆ ముసలామెకి నేను భోజనం పెట్టించొచ్చు. అందుకే నా శిష్యుణ్ణి మనఃస్ఫూర్తిగా అభినందించాను.
కొమ్ముల వెంకట సూర్యనారాయణ
9949602721